ఇది నిఖార్సయిన పొలిటికల్ కరోనా వైరస్.!

coronavirus

coronavirus

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రేపో మాపో రోజువారీ కేసుల సంఖ్య 50 వేలు దాటేయనుంది. ఆ తర్వాత అది రికార్డు స్థాయిలో లక్షకు చేరుకుంటుందేమో.! కరోనా మొదటి వేవ్‌లో లక్ష మార్కుకి దగ్గరగా వెళ్ళిన రోజువారీ కేసుల సంఖ్య, అదృష్టవశాత్తూ క్రమంగా తగ్గుతూ వచ్చింది.

దేశం కరోనా వైరస్‌ని జయించిందని అంతా అనుకున్నారు. కానీ, మళ్ళీ దేశంలో కరోనా వైరస్ విజృంభణ అనూహ్య స్థాయికి చేరుకుంటోంది. స్కూళ్ళు తెరిచారు.. రాజకీయ కార్యక్రమాలు యధాతథంగా జరుగుతున్నాయి. నిజానికి, రాజకీయ కార్యక్రమాలే కరోనా వైరస్ విజృంభణకి కారణాలన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరిగినప్పుడు ఎక్కడా ఫిజికల్ డిస్టెన్సింగ్ అనేది పాటించలేదు. మద్యం ఏరులై పారింది.. మాస్కులు ధరించడమన్న విషయాన్నే మర్చిపోయారంతా. అయినా, కొన్నాళ్ళపాటు పెద్దగా కరోనా పాజటివ్ కేసుల్లో పెరుగుదల కన్పించలేదు. అంతకు ముందు జరిగిన వివిధ రాష్ట్రాల్లోని ఎన్నికల తర్వాత కూడా పెద్దగా మార్పు కనిపించలేదు. కానీ, ఇప్పుడెందుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారుతోంది. ఎక్కడో తేడా జరుగుతోంది. నిజానికి 130 కోట్ల జనాభా వున్న భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడం సాధారణ పరిస్థితుల్లో సాధ్యం కాదు. పెరిగినట్లే పెరిగి, అనూహ్యంగా తగ్గిపోవడం అదృష్టమే.

మళ్ళీ ఇప్పుడు పెరుగుతుండడం దురదృష్టమే. తమిళనాడులో కరోనా వైరస్ తీవ్రత పెరుగుతోంది.. అక్కడ అసెంబ్లీ ఎన్నికల హోరులో ఎవరూ కరోనా నిబంధనల్ని పాటించడంలేదు. పశ్చిమబెంగాల్‌లో ప్రస్తుతానికి పరిస్తితి అదుపులోనే వున్నట్లు కనిపిస్తున్నా రాజకీయ నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించని కారణంగా అదెలాంటి దుష్పరిణామాలకు దారిస్తుందో చెప్పలేం. చూస్తోంటే, కరోనా వైరస్ చుట్టూ ఏదో పొలిటికల్ మాయ కమ్ముకున్నట్లుగా కనిపిస్తోంది. దేశం మరోమారు లాక్ డౌన్ మోడ్‌లోకి వెళ్ళేలా వున్నా, రాజకీయ నాయకులు.. పార్టీలు మాత్రం తమ పని తాము చేసుకుపోతుండడం గమనించాల్సిన విషయం.