Navaneet Kaur : ‘నవనీత్ కౌర్. పేరుకు తగ్గట్లుగానే వెన్నలాంటి వన్నెతరగని అందం ఆమె సొంతం. నవనీత్ కౌర్ పుట్టింది మహారాష్ట్రలో అయినా, పంజాబీ కుటుంబానికి చెందిన ముద్దుగుమ్మ. ‘శీను వాసంతి లక్ష్మి’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైంది.
తొలి సినిమాలో డీ గ్లామర్ రోల్ అయినప్పటికీ చక్కని నటన కనబరించింది నవనీత్ కౌర్. ఆ తర్వాత హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించింది. జూనియర్ ఎన్టీయార్ సరసన ‘యమదొంగ’ సినిమాలో నవనీత్ కౌర్ చేసిన స్పెషల్ సాంగ్ ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది.
నటిగా నవనీత్ కౌర్ తెలుగులోనే కాదు, తమిళ, మలయాళ తదితర భాషల్లోనూ నటించింది. కానీ, ఎక్కడా సంతృప్తి చెందలేదు. చివరికి రాజకీయాల్లో అడుగుపెట్టింది. 2019 ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి లోక్‌సభకు ఎంపికైంది నవనీత్ కౌర్.
రాజకీయంగా కొన్ని వివాదాల్లో ఇరుక్కున్నప్పటికీ మంచి పార్లమెంటేరియన్‌గా పేరు తెచ్చుకుంది చాలా తక్కువ సమయంలోనే నవనీత్ కౌర్.
మహారాష్ట్ర పాలిటిక్స్‌లో తెగువ గల రాజకీయనాయకురాలిగా సత్తా చాటుతున్నప్పటికీ, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పొలిటికల్ ఇష్యూస్‌లోనూ పార్లమెంట్‌లో తనదైన శైలిలో గళం విప్పుతుంటుంది.
సినిమాల్లో నటిగా స్టార్‌డమ్ అందుకోలేకపోయినప్పటికీ, రాజకీయాల్లో మంచి వాగ్ధాటితో పాటు, గ్లామరస్ పొలిటీషియన్‌గా సక్సెస్ అయ్యింది నవనీత్ కౌర్.
మళ్లీ అవకాశమొస్తే, సినిమాల్లో నటిస్తారా.? అని అడిగితే, ఎందుకు నటించను. కానీ, ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా వున్న కారణంగా సినిమాలపై ఫోకస్ పెట్టలేకపోతున్నానని చెప్పుకొచ్చింది.