కోర్టుల ద్వారా జగన్‌ను ఆపడం ఆసాధ్యం 

మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా వేడెక్కాయి.  అమరావతి రైతులు రోడ్డెక్కి చెప్పులతో కొట్టుకుంటే ప్రతిపక్షాలు ఇది అన్యాయమని గగ్గోలు పెడుతున్నాయి.  ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అయితే ఇది ఏపీ చరిత్రలో చీకటి రోజని, గవర్నర్ నిర్ణయంపై కోర్టుల్లో పోరాడతామని ప్రకటించారు.  అయితే ఎప్పటిలాగే ఆ న్యాయ పోరాటం ఎలా ఉంటుంది, ఏయే అంశాల ఆధారంగా ఉంటుందో మాత్రం చెప్పలేదు.  ఎప్పటిలాగే ఏమోషనల్ అయిపోయి న్యాయ పోరాటం అదీ ఇది అంటూ అనేశారు.  కానీ ఒక్కసారి లోతుగా ఆలోచిస్తే బాబుగారు చెబుతున్న న్యాయ పోరాటం అనేది ఏ వైపు నుండీ సాధ్యమయ్యేలా కనబడటం లేదు. 
 
 
గవర్నర్ రాజ్యాంగ విధానాలకు అనుగుణంగానే బిల్లును ఆమోదించారు.  సంతకం పెట్టే ముందు న్యాయ సమీక్ష కూడా జరిపారు.  శాసన సభ ఆమోదం, మండలి వాయిదాపడి చాలా రోజులు గడిచిపోవడం, విభజన చట్టంలో మూడు రాజధానుల బిల్లును కాదనే అంశాలేవీ లేకపోవడం, ప్రధానంగా అసలు రాష్ట్ర పాలన ఎక్కడి నుండి చేయాలి అనేది పూర్తిగా ముఖ్యమంత్రి చేతిలో నిర్ణయం కాబట్టి బిల్లును కాదనడానికి గవర్నర్ గారికి ఎలాంటి కారణాలు కనబడలేదు.  అందుకే ఆమోదం తెలిపారు.  రాజముద్ర రాజ్యాంగ బద్దంగానే పడింది.  ఇవన్నీ బాబుగారికి తెలియవా అంటే తెలియక కాదు ఏమీ చేయలేక ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడేశారు. 
 
 
ఇక కోర్టుల్లో పిటిషన్లు వేస్తామని మాట్లాడే టీడీపీ నేతలు మూడు రాజధానులకు సాంబంధించి కోర్టులో కేసు నడుస్తోంది కాబట్టి ఆ బిల్లును ఆమోదించడం రాజ్యాంగబద్దం కాదని మొదటి నుండి వాదిస్తున్నారు.  కానీ శాసన పరమైన విధానాల్లో కోర్టులు ఎప్పుడూ జోక్యం చేసుకోవని, అలా చేసుకోవడం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్దమని వారు గ్రహించలేకపోతున్నారు.  ఏదైనా బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొంది, చట్టంగా మారాక దాని మీద కోర్టులు సమీక్ష జరిపే వీలుంది.  అమలులోకి వచ్చిన, రావడానికి సిద్దంగా ఉన్న ఆ బిల్లు సరిగ్గా లేదని ఎవరైనా కోర్టుకు వెళ్లొచ్చు.  అప్పుడు కోర్టు ఆ బిల్లు చట్టపరంగా, రాజ్యాంగానికి అనుగుణంగా ఉందా లేదా అనేది సమీక్షిస్తుంది తప్ప పిటిషన్ వేసిన వెంటనే ఆపమని స్టే ఇవ్వదు.
 
 
ఈ మూడు రాజధానుల బిల్లు విషయంలో కూడా ఇప్పుడు జరగబోయేది అదే.  బిల్లులో న్యాయ సమీక్ష జరపడానికి ఏమీ లేదు.  అంతా పకడ్బందీగా ఉండేలా చూసుకున్నారు సీఎం.  చూసుకున్నారు అనేకంటే రాజ్యాంగంలో అలా కుదిరిపోయింది అనుకోవచ్చు.  కాబట్టి కోర్టుల ద్వారా మూడు రాజధానుల బిల్లును అమలుకాకుండా అడ్డుకోవడం దాదాపు అసాధ్యమని నిపుణులు సైతం చెబుతున్నారు.  ప్రస్తుతం బిల్లు విషయంలో శాసన ప్రక్రియ ముగిసింది కాబట్టి దాని మీద వేసే పిటిషన్లను కోర్టు స్వీకరించవచ్చు.  ఇంతకీ బాబుగారు అండ్ టీమ్ కోర్టుల ముందు నివేదించబోయే అంశాలు ఏమిటాయా అంటే మండలి ఆమోదం పొందలేదు విభజన చట్టానికి అనుగుణంగా లేదు, కోర్టులో చర్చ నడుస్తుంటే గవర్నర్ ఎలా సంతకం పెడతారు.  ఇంతకుమించి వారి వద్ద వాదించడానికి ఏమీ లేవు. 
 
 
ఇంతకుముందే మనం చర్చించుకున్నట్టు పై వాదనలేవీ కోర్టుల్లో నిలబడవు.  అన్నిటికీ అధికార పక్షం వద్ద సమాధానాలున్నాయి.  కోర్టులకు ఎలాగూ రాజకీయపరమైన కారణాలు, సంక్షోభాలు ఆవసరం లేదు కాబట్టి స్టే ఇవ్వదు.  కాబట్టి బాబుగారి ముందు ఉన్నదల్లా రాజకీయ పోరాటమే.  జనంలోకి వెళ్లి వీలైతే ఉద్యమాన్ని లేవదీసి పాలక వర్గాన్ని ఒత్తిడిలో పెట్టాలి.  అప్పుడే ఏమైనా చేయగలరు.  కానీ ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితులు ఉద్యమాలకు అస్సలు అనుకూలంగా లేవు.  వైసీపీకి ఉన్న బలం దృష్ట్యా జగన్‌కు వ్యతిరేఖ వాతావరణం సృష్టించండం అంటే దాదాపు అసాధ్యమే.  కాబట్టి బాబుగారు వేడి తగ్గే వరకు ఇలా వాగ్దానాలు, శపథాలు చేసుకుంటూ టైమ్ పాస్ చేయాల్సిందే తప్ప జగన్‌ను అడ్డుకోవడం, ఆపడమనేది దాదాపు అసాధ్యమే.