ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్ ఆపేయాలంటూ ప్రధాని నరేంద్ర మోడీకి కొద్ది రోజుల క్రితం ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖాస్త్రం సంధించిన విషయం విదితమే. ఆంధ్రపదేశ్ రాష్ట్రం ఆ దిశగా నిర్ణయం తీసుకోలేకపోయిందిగానీ, పంజాబ్ ప్రభుత్వమైతే నిర్ణయం తీసేసుకుంది.
పంజాబ్ రాష్ట్రంలో ఇకపై ప్రైవేటు ఆసుపత్రులు వ్యాక్సినేషన్ అందించడానికి వీల్లేదు. ప్రైవేటు ఆసుపత్రులు వ్యాక్సిన్లను అధిక ధరకు విక్రయిస్తున్న విషయం విదితమే. ఆ ఆసుపత్రులకు వ్యాక్సిన్ తయారీ సంస్థలు కూడా అధిక ధరకే విక్రయిస్తున్నాయి.
మరోపక్క, ప్రైవేటు ఆసుపత్రులు అడ్డగోలు ధరలతో వ్యాక్సిన్ విషయమై ప్రజల్ని వేధిస్తున్నాయన్న ఆరోపణలు ప్రముఖంగా వినిపిస్తుండడం గమనార్హం. పాతిక వేల రూపాయల వరకూ కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ ధర అనధికారికంగా పలుకుతోందన్నది దేశంలోని చాలా రాష్ట్రాల్లో వినిపిస్తోన్న వాదన.
ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం వైఎస్ జగన్, ప్రైవేటు ఆసుపత్రులకు వ్యాక్సిన్లను వ్యాక్సిన్ తయారీ సంస్థలు అందించకుండా చూడాలని ప్రధానికి లేఖ రాశారు. అయితే, కేంద్ర ప్రభుత్వం ఈ విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వాస్తవానికి కేంద్రమే, దేశంలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్లను ఉచితంగా అందించాల్సి వుంది.
వ్యాక్సిన్ తయారీ సంస్థలు కేంద్రానికి ఓ ధర, రాష్ట్రాలకి మరో ధర, ప్రైవేటు ఆసుపత్రుల్లో వేయించుకుంటే మరో ధర.. అంటూ చెత్త రూల్స్ పాటించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి, ఆ అవకాశం కల్పించిందే కేంద్ర ప్రభుత్వం. ఆ తప్పిదాన్ని కేంద్రం సరిదిద్దుకోవాల్సిందే. అంతకన్నా ముందు ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్ ఆపేయడమే మంచిది.