Ys Jagan : సీఎం వైఎస్ జగన్ ముందస్తు ‘వ్యూహం’లో నిజమెంత.?

Ys Jagan :  మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ జరిగి ఇంకా నెల రోజులు కూడా పూర్తి కాలేదు. ఇంతలోనే, వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళవచ్చుననే ప్రచారం ఎందుకు జరుగుతోంది.? ఈ ముందస్తు ప్రచారం కారణంగా తాజా మాజీలు లోలోపల ఆనంద పడుతోంటే, తాజా అమాత్యులెందుకు ఆందోళన చెందుతున్నట్టు.?

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపక్షాలు బలపడుతున్నాయన్నది నిర్వివాదాంశం. నిజానికి, తెలుగుదేశం పార్టీలో మళ్ళీ ఊపు రావడానికి కారణం అధికార పక్షం తాలూకు వైఫల్యాలే. ఇంకోపక్క, ‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వం..’ అనడం ద్వారా వైసీపీకి ప్రత్యామ్నాయం టీడీపీనే అనే సంకేతాలు పరోక్షంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పంపించినట్లయ్యింది.

బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ ఎదురవుతున్నాయి వైఎస్ జగన్ ప్రభుత్వానికి గత కొద్ది కాలంగా. మూడు రాజధానుల వ్యవహారం అతి పెద్ద ఫెయిల్యూర్. నిజానికి, ఆ వ్యవహారంలో రాష్ట్ర ప్రజలు అధికార పార్టీకి అండగా వుంటారని ప్రభుత్వ పెద్దలు భావించినా, అలా జరగలేదు.

విపక్షాలు మరింత బలం పుంజుకోకముందే ఎన్నికలకు వెళితే ఎలా వుంటుంది.? అన్న చర్చ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోటరీలో జరుగుతోందట. ఆ కారణంగానే మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ కాస్త ఆలస్యమయ్యిందనీ అంటున్నారు. కానీ, తప్పనిసరి పరిస్థితుల్లో మంత్రి వర్గ విస్తరణ చేయాల్సి వచ్చింది.

90 శాతం మంది మంత్రుల్ని మార్చకుండా దాదాపు సగం మంది పాతవారినే వైఎస్ జగన్ కొనసాగించడం వెనుక ముందస్తు వ్యూహం వుందన్న ప్రచారానికి బలం చేకూరుతోంది. సొంత పార్టీలోనూ చాపకింద నీరులా వ్యతిరేకత పెరగకముందే ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం సరైన వ్యూహమన్నది జగన్ ఆలోచన కావొచ్చు.