YS Jagan : కేంద్రం, రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోందంటూ వైసీపీ పదే పదే విమర్శిస్తూ వస్తోంది. ఇటీవల కేంద్రం బడ్జెట్ పెడితే, అందులో రాష్ట్రానికి సరైన ప్రాధాన్యత దక్కలేదంటూ వైసీపీకి చెందిన చాలామంది నాయకులు మండిపడ్డారు. అత్యంత దారుణం, దుర్మార్గం.. అనే మాటలూ వినిపించాయి.
కేంద్ర హోం శాఖ, విభజన సమస్యలపై ఏర్పాటు చేసిన ఉప సంఘానికి సంబంధించి ‘ప్రత్యేక హోదా అంశాన్ని’ ఎజెండాలో పెట్టి, తీసేయడంపైనా తీవ్రస్థాయి దుమారం చెలరేగింది. ఇంతటి ప్రత్యేక పరిస్థితుల్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, రాష్ట్రానికి వచ్చి, రాష్ట్రంలో పలు రహదారుల ప్రాజెక్టుల్ని ప్రారంభిస్తే.. ఆ కార్యక్రమంలో కేంద్రానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‘థ్యాంక్స్’ చెప్పడం వైసీపీ శ్రేణుల్ని ఆశ్చర్యపరుస్తోంది.
కేంద్రం, రాష్ట్రం మధ్య సత్సంబంధాలు వుండాల్సిందే. రాష్ట్రంలోని ప్రాజెక్టులు గనుక, ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి ఆ కార్యక్రమానికి హాజరవడాన్ని తప్పు పట్టలేం. కేంద్రాన్ని అభినందించొచ్చు.. కృతజ్ఞతలు తెలపొచ్చు. అదే సమయంలో, కేంద్ర మంత్రికి సుతిమెత్తగా అయినా చురకలంటించాలి, నిరసన తెలియజేయాలి కదా.?
మొన్నీమధ్యనే ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు వస్తే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ ఏం చేశారో చూశాం. ఆ మాత్రం తెగువ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, కేంద్ర మంత్రి విషయంలో ఎందుకు లేకపోయిందన్న చర్చ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంలో నడుస్తోంది.
ప్రత్యేక హోదా సహా చాలా అంశాల్లో రాష్ట్రానికి కేంద్రం అన్యాయమే చేస్తూ వస్తోంది. దాన్ని ప్రశ్నించకపోగా, కేంద్రాన్ని ప్రశంసించడమంటే.. అంతకన్నా దారుణం ఇంకేంటనే ఆవేదన రాష్ట్ర ప్రజల్లో వ్యక్తమవుతోంది.