ఎంపీ ర‌ఘురాం బాట‌లో తిరుప‌తి ఎంపీనా?

న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌మ‌రాజు వ్య‌వ‌హారం కంచికి చేరిన సంగ‌తి తెలిసిందే. వైకాపాపై ఆరోప‌ణ‌లు చేసి బ‌య‌ట‌కొచ్చేసి న రఘురాంకి అదిష్టానం షోకాజ్ నోటీసులిచ్చింది. ఈ నోటీస్ పై ర‌ఘురాం అంతే ధీటుగా బ‌ధులిచ్చి మ‌రింత వ్య‌తిరేకం అయ్యారు. ఇక ర‌ఘురాం వేరే పార్టీ చూసుకుని…నియోజ‌క వ‌ర్గ అభివృద్ది ప‌నుల‌కు పాటుప‌డాలి. ర‌ఘురాంకి వైకాపాతో క‌టీప్ అయిపోయి న‌ట్లే. తాజాగా ర‌ఘురాం బాట‌లోనే తిరుప‌తి ఎంపీ బ‌ల్లి దుర్గాప్ర‌సాద్ రావు కూడా ప‌య‌నిస్తున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. ఆయ‌న‌పైనా అస‌మ్మ‌‌తి గ‌ళం జోరుగా వినిపిస్తోంది. టీడీపీ టిక్కెట్ ఇవ్వ‌క‌పోవ‌డంతో 2019 లో వైకాపాలో చేరి పోటీ చేసి గెలిచిన బ‌ల్లి దుర్గా ప్ర‌సాద్ త‌ర్వాతి రోజుల్లో స్వ‌రం మార్చారు.

స్థానిక వైసీపీ నేతలను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండట‌మే ఆయనపై అసమ్మతి పెరగడానికి కారణమైంద‌ని పార్టీ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు మొద‌ల‌య్యాయి. ప్రోటోకాల్ పాటించ‌డం లేద‌ని వైకాపా శ్రేణుల‌ను, సొంత పార్టీనే విమ‌ర్శించ‌డం పార్టీలో పెద్ద దుమార‌మే రేపుతోంది. తిరుప‌తి స్మార్ట్ సిటీ ప‌నుల్లో , ఇటీవ‌ల జ‌రిగిన శంకుస్థాప‌న ప‌నుల్లో దుర్గాప్ర‌సాద్ పేరును ఇంటిపేరు లేకుండా వేయ‌డంపై ఆయ‌న తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసారు. దీని వెనుక అదిష్టామ‌నే కుట్ర చేసింద‌న్నంత‌గా మీడియా స‌మావేశాల్లో మాట్లాడారు. కేంద్రం ఇచ్చిన నిధుల‌తో చేప‌డుతున్న ప్రాజెక్ట్ లో రాష్ర్ట ప్ర‌భుత్వం పెత్త‌నం ఏంట‌ని విమ‌ర్శించారు.

క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డి విష‌యంలోనూ ప్ర‌భుత్వం ఫెయిలైంద‌న్న‌ట్లు వ్యాఖ్యానించారు. దీంతో ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను అదిష్టానం అంతే సీరియ‌స్ గా తీసుకుంది. చిత్తూరు జిల్లా ఇన్ చార్జి మంత్రి దీనిపై విచార‌ణ జ‌రిపి నివేదిక ఇవ్వాల‌ని అదిష్టానం ఆదేశించింది. దీంతో దుర్గా ప్ర‌సాద్ వ్య‌వ‌హారం పార్టీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్ప‌టికే ర‌ఘురాం వ్య‌వ‌హారంతో వైకాపా అదిష్టానం సంచ‌ల‌నంగా మారింది. తాజాగా తిరుప‌తి ఎంపీ వ్య‌వ‌హారం కూడా వెలుగులోకి రావ‌డంతో అదిష్టానం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుంది అన్న దానిపై ఆస‌క్తి నెల‌కోంది. జిల్లా ఇన్ చార్జి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎంపీపై అదిష్టానం చ‌ర్య‌లకు దిగ‌నుంది.