సంపూర్ణ ఆరోగ్యం పొందాలంటే.. ఈ చిరు ధాన్యం మీ ఆహారంలో తప్పనిసరి?

చిరుధాన్యాల్లో ఒకటైన జొన్నలను ప్రతిరోజు మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. జొన్న ధాన్యంలోని పోషక విలువలను గుర్తించిన మన పూర్వీకులు రోజువారి ఆహారంలో జొన్న రొట్టెలు ,జొన్న అన్నం, జొన్న ముద్ద , జొన్న పాయసం ఇలా అనేక రకాలుగా జొన్నలను ఉపయోగించారు. ఈ రోజుల్లో మనం పిజ్జా ,బర్గర్ ,పానిపూరి, నూడిల్స్ వంటి జంక్ ఫుడ్ కు అలవాటు పడి అనేక వ్యాధులను కొని తెచ్చుకుంటున్నాం. ప్రతిరోజు జొన్న చిరుధాన్యాన్ని మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.

జొన్నల్లో మన శరీర పెరుగుదలకు అవసరమైన పిండి పదార్థాలు, మాంసకృతులు, పీచు పదార్థం, విటమిన్స్ ఖనిజలవనాలు పుష్కలంగా లభిస్తాయి. కావున మన శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

జొన్నల్లో క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉండి మన శరీరంలోని ఎముకల దృఢత్వానికి తోడ్పడతాయి. వృద్ధాప్యంలో వచ్చే ఆస్తియోఫోరోసిస్ వ్యాధిని అదుపు చేసి కీళ్ల నొప్పులు, నడుము నొప్పి వంటి సమస్యలను దూరం చేస్తుంది.

షుగర్ వ్యాధిగ్రస్తులు తరచూ తమ ఆహారంలో జొన్నను ఆహారంగా చేసుకుంటే జొన్నల్లో ఉండే పీచు పదార్థం, కార్బోహైడ్రేట్స్ రక్తంలోని గ్లూకోస్ స్థాయిలను నియంత్రించి షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుతుంది. అలాగే ఇందులో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించి గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది

జొన్న ధాన్యంలో అత్యధికంగా 1.6 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది మనం తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణం అయ్యేటట్టు చేసి జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడమే కాకుండా మలబద్ధకం, గ్యాస్ట్రిక్ , అజీర్తి వంటి సమస్యలను తొలగిస్తుంది.

జొన్న గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరంలోని క్యాన్సర్ కణాలను నాశనం చేసి చర్మ క్యాన్సర్ ,ఉదర క్యాన్సర్ , బోన్ క్యాన్సర్ వంటి అనేక రకాల క్యాన్సర్ల నుండి మనల్ని రక్షిస్తుంది.

జొన్నల్లో ఐరన్ ,పోలిక్ యాసిడ్, విటమిన్ బి 6 వంటి పోషకాలు రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి రక్తంలోని హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. విటమిన్ బి6 మన శరీరానికి కావలసిన శక్తిని అందించడంలో సహాయపడి రోజంతా నీరసం ,అలసట వంటి సమస్యలను తొలగిస్తుంది.