విజయవాడ లో సంచలనంగా మారిన హత్యకు రాజకీయాలే కారణమా? భూ వివాదంగా మొదలైన చిన్న గొడవకు ఆజ్యం పోసింది ఆ రెండు రాజకీయ పార్టీలేనా? అంటే అవుననే సంకేతాలు అందుతున్నాయి. రెండు కోట్ల భూమికి సంబంధించిన ఒక వివాదంలో సందీప్ అనే యువకుడు హత్య చేయబడిన సంగతి తెలిసిందే. ఒకే వర్గానికి చెందిన రెండు గ్రూపుల మధ్య గొడవలకు సందీప్ బలయ్యాడు. తొలుత ఈ గొడవ విద్యార్ధి గ్రూపుల మధ్య జరిగిందని ప్రచారంలోకి వచ్చింది. అటుపై ఈ సీన్ లో వైకాపా కు చెందినవారి గొడవ అన్నట్లుగాను ప్రచారం సాగింది. ఇప్పుడా రెండిటిలోనూ నిజం లేదని తాజా సమాచారం.
కత్తులతో, కర్రలతో దాడి చేసుకున్న ఆ రెండు వర్గాల్లో బెజవాడ దుర్గమ్మ సాక్షిగా ఒకరు టీడీపీ అభిమాని కాగా, మరొకరు జనసేన అభిమాని అని అంటున్నారు. ఈ రెండు వర్గాల మధ్య ఎప్పటి నుంచో గొడవలు జరుగుతున్నాయని…చివరికి రెండు కోట్ల భూమి విషయంలో వివాదం తారా స్థాయికి చేరుకోవడంతో సీన్ ఇలా తారుమారైందని అంటున్నారు. స్థానికంగా ఇరు వర్గాల మధ్య ఎప్పటి నుంచో అధిపత్య పోరు కొనసాగుతోందట. టీడీపీ ఫ్యాన్స్-జనసేన ఫ్యాన్స్ పేరిట కొంత కాలంగా ఒకర్ని ఒకరు తిట్టుకోవడం జరిగిందట. చివరికి కోపంతో పెట్రేగిపోయి గ్యాంగ్ హత్యకు పాల్పడినట్లు వినిపిస్తోంది.
మొత్తం 30 మంది ఈ వీధి వార్ లో ఉన్నారు. అందులో ఐదుగురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తాజా సమాచారం. అయితే పూర్తి వివరాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి నిగ్గు తేల్చే పనుల్లో బిజీగా ఉన్నారు. అధికారికంగా మీడియా ముందు పోలీసు అధికారులు వివరాలు వెల్లడిస్తే దీనిపై ఓ క్లారిటీ వస్తుంది. ఈ ఘటనతో బెజవాడ సిటీలో ఒక్కసారిగా మళ్లీ అలజడి మొదలైంది. ఒకప్పుడు ఫ్యాక్షన్ గొడవలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన బెజవాడలో కొన్నాళ్లుగా అలాంటి ఘటనలు లేవు. రాజకీయం రూపం మార్చుకుంటుండంతో క్రైమ్ రేటు తగ్గింది. తాజాగా ప్రశాంతంగా ఉన్న సిటీలో వర్మ మార్క్ యాక్షన్ సీన్ తలపించడం స్థానికులను భయబ్రాంతులకు గురి చేస్తోంది.