రాష్ట్ర హైకోర్టు పరిషత్ ఎన్నికలపై కీలకమైన తీర్పు వెల్లడించిన దరిమిలా, ఏపీ రాజకీయాల్లో ఇంకోసారి పరిషత్ ఎన్నికలు జరుగుతాయా.? అన్న అంశంపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. పరిషత్ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు బాగానే ఖర్చు చేశాయి. అభ్యర్థులు చేసిన ఖర్చు తక్కువేమీ కాదు. పెద్దయెత్తున డబ్బులు పంచారు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు. ఇంతా జరిగాక ఇప్పుడు ఆ పరిషత్ ఎన్నికలు రద్దవడమంటే.. ఎంత నష్టం.? ఈ ప్రశ్న రాజకీయ వర్గాల్లో బాగా వినిపిస్తోంది. కానీ, డబ్బు ఖర్చు చేసి ఎన్నికల్లో గెలవాలనుకోవడమేంటి.? అని ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పుని లెక్క చేయకుండా పరిషత్ ఎన్నికలు నిర్వహించారన్నది రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు వ్యక్తం చేసిన ఆగ్రహం తాలూకు సారాంశం.
ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీపైనా న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే, ఎన్నికలు జరిగిపోయాక.. వాటిని రద్దు చేయడం అంటే కుదరని పని.. అనే భావన అధికార వైసీపీలో వినిపిస్తోంది. ప్రభుత్వం ఈ వ్యవహారంపై అప్పీల్ చేసే అవకాశం వుంది. హైకోర్టులో సవాల్ చేస్తారా.? సుప్రీంకోర్టుకు వెళతారా.? అన్నదానిపై స్పష్టత రావాల్సి వుంది. చాలా గొప్పగా పరిషత్ ఎన్నికల్ని నిర్వహించామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా వ్యాఖ్యానించారు. మరోపక్క, విపక్షాలు.. హైకోర్టు తీర్పుని స్వాగతిస్తున్నాయి. పరిషత్ ఎన్నికలు కొత్తగా నిర్వహించాలనే తమ వాదనకు హైకోర్టు తీర్పు మరింత బలాన్నిచ్చిందని అంటున్నాయి. కరోనా నేపథ్యంలో వాయిదాపడ్డ ప్రక్రియ.. మొదటి నుంచీ తిరిగి ప్రారంభమవ్వాలిగానీ.. ప్రక్రియ మధ్యనుంచి ఎలా మొదలవుతుంది.? అన్నది విపక్షాల వాదన.