లాక్ డౌన్ తో దేశం అంతకంతకు ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోతున్న మాట వాస్తవం. అన్ని రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితి ఒక్కసారిగా కుదేలైపోయింది. గత నెల రోజులుగా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నంతలో కొంతమేరకు కలిసికట్టుగా పనిచేసాయి. దీనిలో భాగంగా కేంద్రం ప్రతీ రాష్ట్రానికి నిధులు కేటాయించి తక్షణమే రిలీజ్ చేసింది. దానికి అదనంగా ప్యాకేజీని కలుపుకుని నిత్యావసరాల కొరతను తీర్చేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఆ క్రమంలోనే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంపై విమర్శలు గుప్పించాయి. కేంద్రం సహాయం ఎంత మాత్రం సరిపోవడం లేదని నిధులు పెంచాలని డిమాండ్ చేసాయి. దానికి తగ్గట్టు కేంద్రం పనిచేసింది. అయితే ఇలా అరకొర సాయం ఎన్నాళ్లు? అన్న దానిపై సరైన క్లారిటీ లేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది.
ఈ నేపథ్యంలో ప్రతి రాష్ట్రం కేంద్ర ఆర్ధిక ప్యాకేజీ కోసం ఎదురు చూడటం అంతకంతకు హీటెక్కిస్తోంది. జాతీయ విపత్తుగా ప్రకటించారు కాబట్టి కేంద్రం ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ ప్రతి పక్షాలు విరుచుకుపడుతున్నాయి. కానీ కేంద్రం నిధుల విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవరిస్తోంది. క్రమేపీ రాష్ట్ర ప్రభుత్వాల ఎదురుచూపులు చూడలేక డిమాండ్లకు దిగుతున్నాయి. అయితే ఈ అత్యయిక విషయాన్ని పసిగట్టిన కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు లాక్ డౌన్ విషయంలో కొన్ని సడలింపులు ఇస్తోన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే తాజాగా మద్యం షాపుల రీ ఓపెన్ కు అనుమతిచ్చిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్రాలకు మద్యం అమ్మకాల ద్వారానే సింహాభాగం ఆదాయం వస్తుందని గమనించిన కేంద్రం ఈ లాక్ డౌన్ సమయంలోనూ ఆ విభాగానికి అనుమతులిచ్చింది. అంటే డైరెక్ట్ గా ఎవరి పాలన వాళ్లే చూసుకోండి…మాకు సంబంధం లేదు అన్న వైఖరిని స్పష్టంగా చెప్పినట్లు అయిందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దానికి తగ్గట్టు ఏపీలో మద్యం షాపులు ఓపెన్ చేయడం ..తెలంగాణలో 29 వరకూ లాక్ డౌన్ అమలులో ఉంటున్నా… అక్కడా నేటి నుంచి లిక్కర్ షాపులు ఓపెన్ చేయడంపై కేంద్రం వైఖరేంటో అర్థమవుతోంది అంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
అలాగే కేంద్ర ప్రభుత్వం , రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధిపత్యాన్ని కోల్పోవడానికి ఇష్టపడలేదు. సంబంధం లేని విషయాలపైనా రాష్ట్ర ప్రభుత్వాల పై అజమాయిషీ చెలాయించాలని కేంద్రం చూస్తోందంటూ తెలంగాణ సహా మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోపిస్తున్నాయి. మరో 15 నుంచి 20 రోజుల పాటు లాక్ డౌన్ కొనసాగిస్తే పరిస్థితి అదుపులోకి వస్తుందని తెలిసినా కేంద్రం జనాలు గుమిగూడే మద్యం షాపులకే అనుమతి ఇచ్చిందంటే పరిస్థితి ఆర్ధం కోసుకోవచ్చు అంటూ ఆర్ధిక నిపుణులు మొట్టికాయలు వేస్తున్నారు.