డాక్ట‌ర్ రామిరెడ్డి పై సుధాక‌ర్ ఆరోప‌ణ నిజ‌మేనా?

Vizag Doctor Sudhakar

డాక్ట‌ర్ సుధాక‌ర్ త‌న‌కు వైద్యం అందిస్తున్న మ‌రో డాక్ట‌ర్ రామిరెడ్డిపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. త‌న‌కు ఇస్తున్న మందులు..ఇంజెక్ష‌న్లు ప్ర‌మాద‌క‌రంగా ఉన్నాయ‌ని….గొంతు త‌డి ఆరిపోవ‌డం..త‌ల తిర‌గ‌డం..యూరీన్ అవ్వ‌క‌పోవ‌డం వంటి స‌మ‌స్య‌లు త‌లుత్తుతున్నాయ‌ని…కేవ‌లం రామిరెడ్డి వైద్యం వ‌ల్లే ఇన్ని స‌మ‌స్య‌లు త‌లెత్తున్నాయ‌ని సుధాక‌ర్ ఆరోపించారు. దీనికి సంబంధించి నేరుగా హైకోర్టుకే సుధాక‌ర్ ఓ లేఖ రాయ‌డం రాష్ర్టంలో సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా రామిరెడ్డి స్థానంలో మ‌రో కొత్త డాక్ట‌ర్ ని నియ‌మిస్తున్న‌ట్లు ఆసుప‌త్రి సూప‌ర్ డెంట్ రాధారాణి తెలిపారు.

ఆమె ప‌ర్య‌వేక్ష‌ణ‌లో కొత్త‌ వైద్యురాలు మాధ‌విల‌త వైద్యం అందిస్తార‌ని వైద్య వ‌ర్గాలు వెల్ల‌డించాయి. దీతో ఈ వ్య‌వ‌హారం కొత్త మ‌లుపు తిరిగేట‌ట్లు క‌నిపిస్తోంది. సుధాక‌ర్ కి స‌రైన వైద్యం అందిస్తున్నామ‌ని ఆసుప‌త్రి వ‌ర్గాలే ముందు వెల్ల‌డించాయి. కానీ ఇప్పుడు రామిరెడ్డి స్థానంలో మాధ‌విల‌త‌ను తీసుకోవ‌డంతో మ‌రిన్ని అనుమానాల‌కు తావిచ్చిన‌ట్లు అయింది. రామిరెడ్డిని హుటాహుటిన మార్చాల్సిన అవ‌స‌రం ఏమోచ్చింది? రామిరెడ్డికి ట్రీట్ మెంట్ చేత‌గాక మార్చారా? లేక ఆయ‌న వైద్యంలో లోపాలున్నాయా? అవీ గాక సుధాక‌ర్ చేసిన ఆరోప‌ణ‌లు వాస్త‌వాలా? లేక‌ ఇందులో ఉన్న‌త అధికారుల హ‌స్తం కూడా ఉందా? అనే ర‌క‌ర‌కాల సందేహాలు రేకెత్తుతున్నాయి.

ఇప్ప‌టికే సుధాక‌ర్ విష‌యంలో ప్ర‌భుత్వానికి మెట్టికాయ‌లు వేసిన హైకోర్టు తాజా స‌న్నివేశంతో మ‌రింత సీరియ‌స్ అయ్యే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఈ కేసు విచార‌ణ‌ను హైకోర్టు సీబీఐకి అప్ప‌గించిన సంగ‌తి తెలిసిందే. సుధాక‌ర్ ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు చేసిన ద‌గ్గ‌ర నుంచి అధికారులు కూపీ లాగుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ కేసుకు సంబంధించిన అన్ని అంశాలు సుధాక‌ర్ కు అనుకూలంగా ఉన్నాయి. తాజా వ్య‌వ‌హారంతో అధికారులు చేసే త‌ప్పిదాల‌తో ప్ర‌భుత్వం మ‌రింత చిక్కుల్లో ప‌డే అవ‌కాశం క‌నిపిస్తోంది.