నారా లోకేష్ షుగర్ వ్యాధితో బాధపడుతున్నారా.?

రాజకీయాల్లో విమర్శలు అత్యంత హేయంగా తయారయ్యాయి. ఒకరు తక్కువా కాదు, ఇంకొకరు ఎక్కువా కాదు.! ఒకర్ని మించి, ఇంకొకరు.. అందరూ ఈ విషయంలో సమానమే. అధినేత మెప్పు కోసం ఏ గడ్డి తినడానికైనా నాయకులు సిద్ధమేనన్నట్లు వ్యవహరిస్తున్నారు.

అసలు విషయంలోకి వస్తే, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ మీద. ‘బోకేష్‌గాడు సన్నబడుతున్నది డైటింగ్ వల్ల కాదు.. షుగర్ వల్ల..’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీటేయడం వైరల్ అయ్యింది.

నారా లోకేష్ ఒకవేళ నిజంగా డయాబెటిస్‌తో బాధపడుతుంటే, అదేమీ నేరం కాదు. దాని వల్లనే ఆయన సన్నబడిపోతున్నాడంటే, అది ఆయన అనారోగ్య సమస్య మాత్రమే. కానీ, షుగర్ జబ్బు గురించి ప్రస్తావిస్తూ విజయసాయిరెడ్డి ట్వీట్ వేయడం ఎంతవరకు సబబు.?

రాజకీయ ప్రత్యర్థులపై ఇలాంటి తీవ్ర ఆరోపణలు, సొంత పార్టీకే నష్టం చేస్తాయని విజయసాయిరెడ్డి లాంటి విద్యాధికుడు తెలుసుకోకపోతే ఎలా.? పైగా, ఆయన పెద్దల సభకు.. అంటే రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రాజకీయాల్లో హుందాతనం అవసరం. కీలక పదవుల్లో వున్నవారు మరింత హుందాగా వ్యవహరించాలి.

కింది స్థాయి నేతలు ఇలాంటి ఆరోపణలు చేస్తే, వాటిని ఖండించాల్సింది ఉన్నత స్థానాల్లో వున్న వ్యక్తులు. విజయసాయిరెడ్డి లాంటోళ్ళే ఇలా ఆరోపణలు చేస్తే, వారిని వైసీపీ అధిష్టానం ఎందుకు కంట్రోల్ చేయడంలేదు.? ఇది జగన్ మోహన్ రెడ్డికి రాజకీయంగా నష్టం కలిగించే అంశం.