లోకేష్ పేరెత్త‌గానే ఫోన్లన్ని ప్లైట్ మోడ్ లోనా?

అక్ర‌మ‌వాహ‌నాల కొనుగోలులో జేసీ బ్ర‌ద‌ర్స్ లో ఒక బ్ర‌ద‌ర్ ప్ర‌భాక‌ర్ రెడ్డి అరెస్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. బిఎస్ -3 వాహ‌నాలను బిఎస్ 4 గా రిజిస్ర్టేష‌న్ చేయించి అక్ర‌మాల‌కు పాల్ప‌డిన నేప‌థ్యంలో ప్ర‌భాక‌ర్ రెడ్డి, అత‌ని కుమారుడు అస్మిత్ రెడ్డిల‌ను అరెస్ట్ చేసి క‌డ‌ప జైలుకు త‌ర‌లించారు. దీంతో టీడీపీ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ అలియాస్ చిన‌బాబు హుటాహుటిన అనంత‌పురం తాడిప‌త్రి కు జేసీ కుటుంబ ప‌రామ‌ర్శ‌కు బ‌య‌లు దేరారు. కానీ ఇక్క‌డే చంద్ర‌బాబు అండ్ స‌న్ కి సొంత పార్టీ నేత‌లే షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యే ప‌య్యావుల కేశ‌వ్, మాజీ మంత్రి ప‌రిటాల సునీత గానీ ఎక్క‌డా క‌నిపించ‌లేదు.

ఇంకా మాజీ ఎమ్మెల్యేలు ప్రభాక‌ర్ చౌద‌రి, ఉన్న హ‌నుమంత‌చౌద‌రి, జితేంద్ర గౌడ్, కందికుంట ప్ర‌సాద్ సైతం ఎవ‌రూ లోకేష్ వెంట లేరు. పోర్జ‌రీ డాక్యుమెంట్ల‌తో అడ్డంగా దొరికిపోయిన నేత‌ల‌కు మ‌న స‌పోర్ట్ దేనికి..వెళ్తే మాట ప‌డాల్సి వ‌స్తుంద‌న్న కార‌ణంగానే వీళ్లంతా దూరంగా ఉన్న‌ట్లు పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారి తీసింది. అయినా జేసీ కుటుంబంపై సానుభూతి చూపించేంత గొప్ప నేత కాదంటూ వాళ్ల‌లో వాళ్లే గుసుగుస‌లాడుకున్నారుట‌. ఇక లోక‌ష్ పేరు ఎత్త‌తే మండిప‌డ్డే నాయ‌కులు సీమ‌లో చాలా మందే ఉన్నారు. నిన్న గాక మొన్నొచ్చిన లోకేష్ కు పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించ‌డ‌పై స‌ర్వ‌త్ర విమర్శ‌లు వ్య‌క్తం అవుతోన్న నేప‌థ్యంలో దూరంగా ఉండ‌ట‌మే మంచిద‌ని భావించి సీనియ‌ర్స్ అంతా దూరంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఇలా లోకేష్ వెంట ఎవ‌రూ లేక‌పోవ‌డంతో హుటాహుటిన హైద‌రాబాద్ లో తెలుగు దేశం భ‌వనం నుంచి స్థానికంగా ఉండే కార్యాల‌యాల‌కు, నేత‌ల‌కు ఫోన్లు వెళ్లాయ‌ట‌. నేత‌లంతా లోకేష్ వెంట ఉండాల‌ని ఫోన్ల ద్వారా సందేశాలు పంపించారుట‌. దీంతో ముఖ్య నేత‌లంతా విష‌యాన్ని ముందే గ‌మ‌నించి కొంత‌మంది ఫోన్లు ప్లైట్ మోడ్ లో పెట్టార‌ని సొంత పార్టీ వ‌ర్గంలోనే చ‌ర్చ‌కొచ్చింది. ఈ విష‌యంలో చంద్ర‌బాబు నాయుడు స‌ద‌రు నేత‌ల‌పై కాస్త సీరియ‌స్ గానే ఉన్నారుట‌.