బాలీవుడ్ నటి కంగనా రనౌత్, 2024 ఎన్నికల్లో లోక్ సభకు పోటీ చేయబోతోందట. ఈ విషయమై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. దేశానికి స్వాతంత్ర్యం 1947లో కాదు, 2014లో వచ్చిందంటూ కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వెనుక, ఆమె పొలిటికల్ వ్యూహాలు స్పష్టంగా కనిపిస్తున్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు.
కంగనా రనౌత్ ఓ ఖరీదైన బిచ్చగత్తె.. అంటూ కొందరు రాజకీయ నాయకులు విమర్శిస్తున్న వేళ, కంగనా రనౌత్ గనుక బీజేపీలో చేరితే.. అది ఇంకో సంచలనమే అవుతుంది. గత కొంతకాలంగా కంగనా రనౌత్, బీజేపీ వైపు నిలబడింది. ఆమెకు ఏ సమస్య వచ్చినా, బీజేపీ ఆమెకు అండా వుంటోంది.
మరోపక్క, బీజేపీకి అవసరమైనప్పుడల్లా బీజేపీ ప్రత్యర్థుల మీద కంగనా రనౌత్ తనదైన స్టయిల్లో విరుచుకుపడుతోంది. ఇందుకోసం కంగనా రనౌత్ భారీగానే ‘రెమ్యునరేషన్’ అందుకుంటోందన్న విమర్శలూ లేకపోలేదు. అయితే, కంగనా రనౌత్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనతోనే ఇదంతా చేస్తోందన్నది తాజాగా అందుతున్న సమాచారం.
అన్నీ అనుకున్నట్టు జరిగితే మహారాష్ట్ర లేదా ఆమె సొంత రాష్ట్రం నుంచి కంగనా రనౌత్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశముందట. అలాగే తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల నుంచి కూడా కంగనతో పోటీ చేయించేందుకు బీజేపీ సమాలోచనలు చేస్తోందని సమాచారం.
ఏదిఏమైనా, కంగనా రనౌత్.. దేశ స్వాతంత్ర్యం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సమర్థనీయం కాదు. ఇలాంటి సందర్భాల్లోనే రాజద్రోహం కేసులు పెట్టడం సబబే అనిపిస్తుంటుంది.