భారత రాజకీయాలను గురించి చెప్పాలంటే కులాల, మతాల ప్రస్తావన లేకుండా చెప్పలేము. దేశంలో జరిగే ప్రతి ఎన్నికకు ఈ కుల, మత సమీకరణలను రాజకీయ నాయకులు వాడుతూ ఉంటారు. అలాగే ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పటి వరకు వైసీపీ కులాల, మతాల పట్ల వ్యవహరించిన తీరును పూర్తిగా మారుస్తూ కొత్త విధానాలను అనుసరిస్తున్నారు. ఈ కొత్త విధానాలను, వ్యూహాలను ఏర్పాటు చెయ్యడానికి లోకల్ బాడీ ఎలక్షన్స్ కారణమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
ఆ సామాజిక వర్గాన్ని జగన్ వదిలేస్తారా!!
2019 ఎన్నికల్లో వైసీపీ గెలవడానికి కేవలం ఒక్క సామాజిక వర్గమే కారణమని చెప్పలేం, కానీ టీడీపీకి మద్దతుగా నిలిచే బీసీలు జగన్ కు కొండంత అండగా నిలిచి ఘన విజయాన్ని ఇచ్చారు. అలాగే 2019 ఎన్నికల్లో కాపు నాయకులు కూడా జగన్ కు అండగా నిలిచారు. అయితే ఇప్పుడు జగన్ మెల్లగా కాపు సామాజిక వర్గాన్ని పూర్తిగా వదిలేసి కేవలం బీసీలపై ఆధారపడనున్నారని సమాచారం. ఎందుకంటే ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రజలు జనసేన బీజేపీతో కలవడం వల్ల వాళ్ళందరూ కూటమి వైపు వెళ్తున్నారు. జగన్ కు కాపు వర్గం నుండి వచ్చే ఓటు బ్యాంక్ తగ్గుతుందని గమనించిన జగన్ ఇప్పుడు పూర్తిగా బీసీలను ఆకట్టుకునే పనిలో పడ్డారు.
టీడీపీలో ఇబ్బందిలో పడిందా!!
జగన్ కాపులను వదిలేసి బీసీలను ఆకట్టుకోవడం వల్ల టీడీపీని పూర్తిగా భూస్థాపితం చేయనున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు టీడీపీని నడిపించేదే బీసీలు. వాళ్ళకే ఇప్పుడు జగన్ గాలం వెయ్యడంతో టీడీపీకి ఇబ్బందులు మొదలు కానున్నాయి. ఇప్పటికే పతనానికి చేరువలో ఉన్న టీడీపీకి ఇప్పుడు జగన్ ప్రయోగించిన ఈ నూతన వ్యూహం మరిన్ని కష్టాలు తెచ్చింది. జనసేన వల్ల ఇప్పటి వరకు టీడీపీకి మాత్రమే నష్టం కలుగుతుందని అందరూ భావించారు కానీ ఇప్పుడు వైసీపీకి కూడా మెల్లగా కష్టాలు మొదలు అయ్యాయి.