రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరో పెద్ద పీఠ వేస్తున్నారా? జగన్, విజయసాయి రెడ్డి బిజీ షెడ్యూల్ కారణంగా వైకాపా లో సజ్జల కీలకంగా మారబోతున్నారా? అంటే అవుననే పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. జగన్ పరిపాలనపై ఎక్కువగా దృష్టిపెట్టాల్సి ఉండటంతో ఆయన పార్టీ పరంగా అనూహ్య నిర్ణయాలు దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. పార్టీ అధ్యక్ష పదవీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని జగన్ యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ దిశగా ఆయన ఇప్పటికే కొందరు సన్నిహితుల నుంచి అభిప్రాయాలు సైతం తీసుకున్నరని వినిపిస్తోంది.
జగన్ సీఎం అయిన దగ్గర నుంచి పార్టీ బలోపేతంపై దృష్టి లేకపోతున్న సంగతి తెలిసిందే. తొలి నాళ్లలో రెండు సార్లు మాత్రమే పార్టీ నాయకులతో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఆబాధ్యతల్ని పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి అప్పగించారు. పార్టీ నాయకులను కలవడం, తరుచూ వారితో సమావేశంలు నిర్వహించడం విజయసాయి చూసుకున్నారు. అటు పార్టమెంట్ సభ్యుడిగాను కొనసాగుతున్నారు. ఇప్పటికే వైకాపా 22 ఎంపీ స్థానాలున్న వైకాపా, రాజ్యసభ సభ్యులతో దేశంలో నాలుగో పార్టీగాను అవతరించింది. దీంతో పార్టీ భవిష్యత్ లో జాతీయ స్థాయిలో క్రియాశీలక భూమిక పోషించనుంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఆయన దేశ రాజధానిలోనే ఎక్కువ సమయం కేటాయించే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్ష బాధ్యతల కు ఆయన న్యాయం చేయలేరు. ఈ నేపథ్యంలో ఆ బాధ్యతల నుంచి విజయసాయి తప్పుకోనున్నారని ప్రచారం సాగుతోంది. ఆయన స్థానంలో ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డిని నియమించాలని అదిష్టానం సన్నాహాలు చేస్తోందిట. కార్య నిర్వాహక అధ్యక్ష బాధ్యతలకు సజ్జల అన్ని రకాలుగా అర్హుడని క్యాడర్ భావిస్తోందిట. పార్టీ పరంగా అన్ని ప్రాంతాల నేతలతోనూ సజ్జల సత్ససంబంధాలు నెరపడం సజ్జలను సీన్ లోకి దించడానికి ప్రధాన కారణంగా వినిపిస్తోంది. ప్రస్తుతం రాష్ర్టంలో చోటు చేసుకున్న కరోనా వైరస్ పరిస్థితులు అదుపులోకి రాగానే సజ్జలకు పెద్ద పీఠ వేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.