కరోనా వ్యాక్సినేషన్ దేశవ్యాప్తంగా జోరందుకుంది.రికార్డు స్థాయిలో ప్రతిరోజూ ఆయా రాష్ట్రాలు వ్యాక్సినేషన్ చేస్తున్నాయి. కేంద్రం, రాష్ట్రాలకు ఉచితంగానే వ్యాక్సిన్లను అందిస్తోంది.. రాష్ట్రాల ఒత్తిడి మేరకు. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది.
అంతా బాగానే వుందిగానీ, ఇంతకీ వ్యాక్సిన్.. కరోనా వైరస్ మీద నిజంగానే పని చేస్తోందా.? లేదా.? ఈ అనుమానం ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలామందిలో కనిపిస్తోంది.
వ్యాక్సిన్ వేసుకున్నా, వెంటనే కొందరికి వ్యాక్సిన్ వేయించుకున్నట్లు కన్ఫర్మేషన్ రావడంలేదు. సిబ్బంది పొరపాట్ల కారణంగానే జరుగుతోంది ఇది. ఇంకోపక్క కొన్ని చోట్ల ఖాళీ సిరెంజిలను గుచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు.
మరికొన్ని చోట్ల ఫేక్ వ్యాక్సిన్ల దందా కొనసాగుతోంది. చాలా అరుదుగానే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నా.. ఇది అత్యంత తీవ్రమైన పరిస్థితి. వ్యాక్సినేషన్ జరిగినట్లు కన్ఫర్మేషన్ రాకపోతే.. విద్యావంతులు దాన్ని కాస్తో కూస్తో గుర్తించగలరు. మరి, విద్యావంతులు కాకపోతే పరిస్థితి ఏంటి.? ఇవన్నీ ఓ యెత్తు.. సక్రమంగా వ్యాక్సినేషన్ జరిగినా, అది కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పిస్తుందా.? లేదా.? అన్నది ఇంకో యెత్తు.
రోజుకో కొత్త అధ్యయనం.. జనాన్ని గందరగోళంలోకి నెట్టేస్తోంది. కోవాగ్జిన్ బాగా పనిచేస్తోందని కొన్ని వార్తా కథనాలు.. కోవిషీల్డ్ బాగా పని చేస్తోందని మరికొన్ని వార్తా కథనాలు.. అసలు ఈ రెండిటి వల్ల ఒరిగేదేమీ లేదనీ, కరోనా వైరస్.. ఈ రెండు వ్యాక్సిన్లనూ ఓడించేస్తోందని మరికొన్ని కథనాలు మీడియాలో వెలుగు చూస్తున్నాయి.
ఆయా అధ్యయనాల్ని కోట్ చేస్తూ మీడియా రాస్తున్న ఇలాంటి రాతలతో జనంలో అయోమయం నెలకొంటోంది. ‘ఎవరూ భయపడాల్సిన పనిలేదు. కరోనా వైరస్ మీద వ్యాక్సిన్లు సమర్థవంతంగా పనిచేస్తున్నాయ్..’ అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నా.. మీడియాలో ఈ తరహా కథనాలు ఎందుకు ఆగడంలేదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.