టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ఇటీవలి కాలంలో ఒకింత ఎక్కువ హంగామా చేస్తున్నారు. నిజానికి, ప్రతిపక్షం తరఫున ఇంతలా బలమైన వాయిస్ వినిపిస్తున్నందున నారా లోకేష్ ఖచ్చితంగా పార్టీ శ్రేణుల దృష్టిలో హీరో అవ్వాలి.
తనయుడి ప్రవర్తన చూసి నారా చంద్రబాబునాయుడు ఫుల్ ఖుషీ అవ్వాలి. ఇంతకీ, పరిస్థితులు పార్టీలో నారా లోకేష్ పట్ల అంత సానుకూలంగా వున్నాయా.? చంద్రబాబు, నారా లోకేష్ విషయంలో ఎలా ఫీలవుతున్నారు.? ఈ అంశాలపై రాజకీయ వర్గాల్లో చిత్ర విచిత్రమైన రీతిలో చర్చ జరుగుతోంది. ఆ చర్చల్లోనూ భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల రద్దు వ్యవహారంలో నారా లోకేష్ పాత్ర తక్కువేమీ కాదు. అలాగని లోకేష్ చేపట్టిన ఉద్యమం దెబ్బకి ప్రభుత్వం దిగొచ్చిందనడంలోనూ అర్థం లేదు. ఆ సంగతి పక్కన పెడితే, ‘ఆత్మలతో మాట్లాడటం కాదు.. అంతరాత్మతో మాట్లాడటం నేర్చుకో..’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద పొలిటికల్ పంచ్ వేసిన నారా లోకేష్, దానికిగాను విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. రాజకీయాల్లో పొలిటికల్ పంచ్.. పేలితే బాగానే వుంటుంది. కానీ, అది జనంలోకి వెళ్ళేసరికి సీన్ మారిపోతుంది.
ఈ విషయం సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న చంద్రబాబుకి అర్థం కాకుండా వుంటుందా.? అలాగని నారా లోకేష్ స్పీడుని తగ్గించే సాహసం చంద్రబాబు చేయలేరు. ఏదన్నా విషయంలో నారా లోకేష్ నోరు జారి, అరెస్టయితే.. ఆ తర్వాత సీన్ మారిపోతుంది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు నోరు తెరవలేని దుస్థితిలో వున్నారు. అదే పరిస్థితి నారా లోకేష్ విషయంలో ఎదురైతే.? అదే, ఆ బెంగే చంద్రబాబుని వేధిస్తోందట ఇప్పుడు.