దుబ్బాక ఎన్నికల ఫలితం తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చివేసిందనే చెప్పాలి. దుబ్బాక ఫలితాలకు ముందు ఎన్నికల పోటీ అంటే తెరాస మరియు కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉండేది, కానీ ఇప్పుడు బీజేపీ మరియు తెరాస మధ్య పోటీ అన్నట్లు తయారైంది . దీనికి ప్రధాన కారణం బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ అనే చెప్పాలి.
రేవంత్ స్థానంలో బండి
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ను ఢీ కొట్టగలిగే సత్తా కలిగిన నేత ఎవరయ్యా అంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మాత్రమే అనుకునేవాళ్లు, అయితే మెల్ల మెల్లగా ఆ స్థానంలోకి బండి సంజయ్ వచ్చాడు. నిజానికి రేవంత్ రెడ్డి దగ్గరున్న రాజకీయ పరిణితి కానీ, ప్రభుత్వాన్ని చిక్కులో నెట్టే నేర్పరితనం బండి సంజయ్ దగ్గర పెద్దగా లేకపోయిన కానీ, వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం, తమకు ప్రతికూలంగా ఉన్న పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవటంలో బండి సంజయ్ దిట్ట, దానికి తోడు దుబ్బాకలో బీజేపీ గెలవటం కూడా బండి సంజయ్ కు బాగా కలిసివచ్చింది. అన్నిటికంటే ప్రధానంగా తెలంగాణ బీజేపీ పగ్గాలు చేతిలో ఉండటంతో బండి సంజయ్ తన దూకుడు చూపిస్తూ రేవంత్ స్థానాన్ని ఆక్రమించాడు.
కేసీఆర్ ను భయపెట్టే నాయకుడు
గతంలో సీఎం కేసీఆర్ కు ఓటమి రుచి చూపించాలన్న, ఓటమి భయం కలిగించాలన్న అది రేవంత్ రెడ్డితోనే సాధ్యమని యావత్తు తెలంగాణ మొత్తం భావించేది, దీనితో రేవంత్ రెడ్డికి విపరీతమైన క్రేజ్ ఉండేది, కానీ నేడు ఆ స్థానాన్ని బండి సంజయ్ ఆక్రమించాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ కు మొదటిసారి దుబ్బాకలో ఓటమి రుచి ఏమిటో చూపించాడు బండి సంజయ్, ఇక ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో ఇతమి భయం అంటే ఏమిటో తెలియచేస్తున్నాడు.
కేసీఆర్ పైకి చెప్పకపోయిన కానీ ఓటమి భయం తెరాస పార్టీలో కనిపిస్తుంది. అధికార బలాన్ని ఉపయోగించుకొని గ్రేటర్ ఎన్నికల్లో గెలవచ్చు కానీ ఓటమి భయాన్ని మాత్రం ప్రస్తుతం తెరాస అనుభవిస్తుంది. ఈ విషయంలో బండి సంజయ్ సక్సెస్ అయ్యాడు. అతని కంటే ముందే రింగ్ లో దిగిన రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్ కు ఓటమిని కానీ, ఓటమి భయాన్ని కానీ కలిగించలేకపోయాడు. దీనితో కేసీఆర్ కూడా తన టార్గెట్ రేవంత్ రెడ్డి మీద కాకుండా బండి సంజయ్ మీద ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది.
కాంగ్రెస్ చేసిన తప్పే రేవంత్ కు శాపం
తెలంగాణలో తెరాసకు సరైన పోటీ ఇవ్వగలిగిన స్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేడు ఉనికిని కాపాడుకోవటానికి కింద మీద పడే దారుణమైన స్థితికి చేరుకుంది అంటే దానికి కారణం కాంగ్రెస్ అగ్ర నాయకత్వం చేతకాని తనమే, రేవంత్ రెడ్డి లాంటి దూకుడైన నేతను చేతిలో పెట్టుకొని, ఇప్పటికే అనేక సార్లు విఫలమైన నేతనే పీసీసీ చీఫ్ గా కొనసాగించటం పెద్ద తప్పు.రేవంత్ రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చిన కానీ, ఆయన సొంతగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేని స్థితిలో చేతులు కట్టేశారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుగున పెట్టె విధంగా ఏమైనా నిర్ణయం తీసుకుంటే, ఎక్కడ రేవంత్ కు మంచి పేరు వస్తుందో అనే భయంతో సొంత పార్టీ నేతలే మద్దతు ఇచ్చేవాళ్ళు కాదు. దీనితో ఎంతో దూకుడైన రేవంత్ రెడ్డి ఏమి చేయలేని స్థితిలో ఉండిపోయాడు.
అంగట్లో అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు తయారైంది తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి, రేవంత్ లాంటి నేతను చేతిలో పెట్టుకొని, పార్టీని నడిపించలేక తన చావును తానే కొనితెచ్చుకుంటుంది కాంగ్రెస్, పార్టీలోని సీనియర్ నేతలను కాదనలేక రేవంత్ ను పక్కన పెట్టటం ముమ్మాటికీ పెద్ద తప్పు. రేవంత్ లాంటి నేతకు పగ్గాలు అప్పగిస్తే తెరాస కు పోటీగా పార్టీని నడిపించే వాడు, ఆ ఛాన్స్ అతనికి ఇవ్వకపోవటంతో బండి సంజయ్ ఎగరేసుకొనిపోయాడు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ సరైన నిర్ణయం తీసుకుంటే రేవంత్ రెడ్డి మళ్ళీ తన దూకుడు చూపిస్తూ కాంగ్రెస్ ను రేసులో నిలిపే ఛాన్స్ ఉంది, లేకపోతే రేవంత్ స్థానాన్ని ఎలాగైతే బండి సంజయ్ ఆక్రమించాడో, కాంగ్రెస్ స్థానాన్ని పూర్తిగా బీజేపీ ఆక్రమించే అవకాశం ఉంది.