దేశంలోని మిగితా రాష్ట్రాలతో పోల్చితే ఏపీ సీఎం జగన్ వందపాళ్లు నయం. పాలనాపరంగా జగన్ ను వంక పెట్టేదే లేదు. నూటికి నూరు శాతం సమర్థంగా పని చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన సక్సెస్ అయ్యారు. దాంట్లో నో డౌట్. చిన్న వయసు అయినా.. రాజకీయ అనుభవం తక్కువ ఉన్నా… ముఖ్యమంత్రిగా తొలిసారి పీఠాన్ని అధిష్టించినా.. ఏమాత్రం తొణకకుండా.. రాష్ట్రాన్ని దేశంలోనే ముందంజలో ఉంచారు జగన్.
వేరే ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ పథకాలను ఏపీలో అమలు చేస్తున్నారు. కేంద్రం కూడా ఏపీ పాలనను చూసి మెచ్చుకుంటోంది. మొత్తం మీద ముఖ్యమంత్రిగా జగన్ సక్సెస్ అయ్యారు. కానీ..
జగన్ చేసే కొన్ని విషయాలు మాత్రం పార్టీకి పెద్ద తలనొప్పిని తెస్తున్నాయట. అవి నిజానికి చిన్న విషయాలే కానీ.. వాటి వల్ల వైసీపీ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. పార్టీలోని పెద్ద పెద్ద నాయకులకు డోకా లేదు కానీ.. క్షేత్రస్థాయి నాయకులతో సీఎం జగన్ టచ్ లో ఉండటం లేదని.. అసలు జగన్ తమను పట్టించుకోవడం లేదని వాళ్లు వాపోతున్నారు. పార్టీలో, ప్రజల్లో తమకు విలువ లేకుండా చేస్తున్నారని.. ఇలా అయితే పార్టీకి తీరని నష్టం వాటిల్లుతుందని వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదంతా చదువుతుంటే మీకు ఇంకో విషయం గుర్తుకు రావాలి. ఇంకో వ్యక్తి గుర్తుకు రావాలి. ఆయనే చంద్రబాబు. ఆయన కూడా అధికారంలో ఉన్న సమయంలో.. క్షేత్రస్థాయి నాయకులను పట్టించుకోలేదు. దీంతో మొదటికే మోసం వచ్చింది. క్షేత్రస్థాయి నాయకులను, కార్యకర్తలనే కాదు.. ప్రజాప్రతినిధులను కూడా చంద్రబాబు అప్పట్లో పట్టించుకోలేదు. దీంతో పార్టీ 2019 లో ఘోరంగా ఓడిపోయింది. అధికారంలోకి వచ్చాక తమనే పట్టించుకోలేదన్న అసంతృప్తితో ఎన్నికల సమయంలో పార్టీ కార్యకర్తలు సరిగ్గా ప్రచారంలో పాల్గొనలేదు. పార్టీ అధినేత పట్టించుకోకపోతే.. ఏ నాయకుడైనా పార్టీలో సంతోషంగా ఉండలేడు.
ఇప్పుడు వైసీపీలోనూ అదే జరుగుతోంది. కింది స్థాయి నాయకుడి దగ్గర్నుంచి.. జిల్లా స్థాయి నాయకుడి వరకు.. అందరూ అసంతృప్తితో రగిలిపోతున్నారట. పార్టీ వ్యవహారాలపైనే జగన్ ఎక్కువగా ఫోకస్ పెట్టడం లేదని.. కింది స్థాయి నాయకులను అస్సలు పట్టించుకోవడం లేదని కార్యకర్తలు బాధపడుతున్నారు.
అయితే.. ఇది ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి పార్టీకి తీరని నష్టం వాటిల్లుతుందని.. కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేయలేరని.. దాని వల్ల వచ్చే ఎన్నికల్లో పార్టీ చాలా నష్టపోవాల్సి వస్తుందని వాళ్లు వాపోతున్నారు. మరి.. జగన్ ఇప్పటికైనా మేల్కొని కింది స్థాయి నాయకులను కలుపుకొని పార్టీ వ్యవహారాలపై దృష్టి పెడతారా? అనేది వేచి చూడాల్సిందే.