ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021కి అంతా సిద్ధమయ్యింది. కాస్సేపట్లో నరాలు తెగే ఉత్కంఠ కలిగించేలా టీ20 పోటీలు ప్రారంభం కాబోతున్నాయి. చివరి ఓవర్ వరకూ టెన్షన్ టెన్షన్.. టై అయితే, సూపర్ ఓవర్. మళ్ళీ టై అయితే ఇంకో సూపర్ ఓవర్. బంతి బంతికీ బీభత్సమైన ఎంటర్టైన్మెంట్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇచ్చే కిక్కు అలాగే వుంటుంది మరి. బౌలర్ వికెట్ తీస్తాడా.? బ్యట్స్ మెన్ బంతిని బౌండరీ అవతలకు పంపిస్తాడా.? అని ప్రతి బంతికీ ఉత్కంఠ కలుగుతుంటుంది. కళ్ళు చెదిరే ఫీల్డింగ్ విన్యాసాలు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రధాన ఆకర్షణల్లో భాగమే. చెప్పుకుంటూ పోతే చాలానే వుంటాయ్. అదే సమయంలో, ఛీర్ గాళ్స్ కనిపించరు.. మైదానంలో ప్రేక్షకులే వుండరు. ఇదంతా కరోనా ఎఫెక్ట్. ఆటగాళ్ళు.. ఆడేందుకు వస్తారు, మళ్ళీ బస చేసిన హోటళ్ళకు వెళ్ళిపోతారు. ఇతరులెవర్నీ కలిసేందుకు వారికి అవకాశమే లేదు. కరోనా దెబ్బకి క్రికెట్ రూల్స్ మారిపోయాయ్ మరి.
ప్రత్యక్షంగా వీక్షించలేకపోతేనేం.. టీవీల్లోనో మొబైల్ ఫోన్లలోనో, కంప్యూటర్ల ముందు కూర్చునో ప్రత్యక్ష ప్రసారాల్ని తిలకించేయొచ్చు. ఇలా ప్రత్యేకంగా ఐపీఎల్ చూడాల్సి రావడం వరసగా ఇది రెండో ఏడాది. ప్రారంభోత్సవ వేడుకలూ లేకుండానే ఐపీఎల్ ప్రారంభం కాబోతోంది. ఆటగాళ్ళలో కొందరు ఇప్పటికే కరోనా బారిన పడటం కాస్త ఆందోళన కలిగిస్తోంది. టైటిల్ ఎవరు గెలుస్తారు.? అనే కాదు, బంతి బంతికీ బెట్టింగులూ జోరుగా సాగనుండడం ఐపీఎల్ మరో ప్రత్యేకత. కోట్లాది అనధికారిక వ్యాపారం ఈ బెట్టింగుల ద్వారా జరుగుతోంది చాలా ఏళ్ళుగా. ఈసారీ దానికి అడ్డుకట్ట వేయడం సాధ్యమయ్యే పని కాదు. ఎంటర్టైన్మెంట్ లైక్ నెవర్ బిఫోర్.. అంటూ వచ్చేస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021కి ఆహ్వానం పలికేద్దామా మరి.! అన్నట్టు మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అన్న ప్రచారం జరుగుతోంది. గత సీజన్ (2021)లో నిరాశపర్చిన ధోనీ సారధ్యంలోని చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టు ఈసారి పుంజుకుంటుందా.? ముంబై ఇండియన్స్ టైటిల్ వేటలో హ్యాట్రిక్ నమోదు చేస్తుందా.? వేచి చూడాల్సిందే.