వైసీపీలో అంతర్గత పోరుతో లాభం టీడీపీకా.? జనసేనకా.?

గుంటూరు జిల్లాలో ఓ ఎంపీకీ, ఓ ఎమ్మెల్యేకీ మధ్య ఇసుక యుద్ధం జరిగింది. నెల్లూరు జిల్లాలో ఓ ఎమ్మెల్యే, ఓ మంత్రి మధ్య మట్టి గొడవ రాజకీయ రచ్చకు కారణమైంది. తూర్పుగోదావరి జిల్లాలో ఓ ఎంపీ, ఎమ్మెల్యే రచ్చకెక్కారు. శ్రీకాకుళం జిల్లాలో ఓ ఎమ్మెల్సీ, ఓ నాయకుడికీ మధ్య రచ్చ షురూ అయ్యింది. అందరూ వైసీపీ నాయకులే. ఇవి పైకి కనిపించిన చాలా తక్కువ విషయాలు మాత్రమే. కానీ, పైకి కనిపించనివి ఇంకా ఇంకా ఉన్నాయి. ఉత్తరాంధ్రలో వైసీపీ సీనియర్ నేత ఒకరు మంత్రి పదవి కోసం సోదరుడితో రాజకీయ యుద్ధం చేస్తున్నారు. చిత్త‌ూరు జిల్లాలో ఎమ్మెల్యే రోజాపై వైసీపీ నేతలే కక్ష్య పూరిత రాజకీయాలు చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇంత జరుగుతున్నా, పరిస్థితిని చక్కదిద్దేందుకు వైసీపీలో ముఖ్య నేతలెవరూ ప్రయత్నించడం లేదు. ఎందుకిలా.? ఇదే ఇప్పుడు వైసీపీ శ్రేణుల్ని అయోమయానికి గురి చేస్తున్న అంశం.

మామూలుగా అయితే, ఈ తరహా వివాదాల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించేయాలి. లేకపోతే, చిన్న గొడవ ముదిరి పాకాన పడుతుంది. పార్టీని భ్రష్టు పట్టించేస్తుంది. వైసీపీకి హనీమూన్ పిరియడ్ ముగిసిపోయి చాన్నాళ్లయ్యింది. స్థానిక ఎన్నికల ఫలితాల్ని చూసి మురిసిపోతే, కింది స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటోన్న సమస్యల కారణంగా పెరుగుతున్న వ్యతిరేకత, వైసీపీలో అంతర్గత పోరు.. ఇవన్నీ వైసీపీ పతనానికి కారణమవుతాయి. త్వరలో జనంలోకి వెళతానంటోన్న సీఎం జగన్, క్షేత్ర స్థాయిలో పాలనాపరమైన వ్యవహారాల మీదనే కాకుండా, పార్టీ వ్యవహారాల మీద కూడా దృష్టి పెట్టి తగు చర్యలు తీసుకుంటారేమో చూడాలిక.