మండపేటలో ముదిరిన రాజకీయాలు.. తోట వర్సెస్ వేగుళ్ళ

thota vs vegulla telugu rajyam

  రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరు వుండరు, అవసరానికి అందరు అటు ఇటు, ఇటు అటు అవుతారు. తూర్పు గోదావరి జిల్లాలోని మండపేట నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంది. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు కు పోటీగా తోట త్రిమూర్తులు మండపేటలో రాజకీయం చేస్తున్నారు. గతంలో వీళ్లిద్దరు మంచి స్నేహితులు. రామచంద్రపురం టీడీపీ నేతగా త్రిమూర్తులు, మండపేట టీడీపీ నేతగా జోగేశ్వర రావు కలిసి పనిచేసేవాళ్ళు.

thota vs vegulla telugu rajyam

  2019 లో రామచంద్రపురం నుండి తోట ఓడిపోవటంతో వైసీపీ లోకి వెళ్ళిపోయాడు. నిజానికి 2019 ఎన్నికల ముందే తోట వైసీపీ లోకి వెళ్లాలని అనుకున్నాడు, అప్పుడు వైసీపీ అధిష్టానం తెలివిగా మండపేట టిక్కెట్ ఇస్తామని, అక్కడ నుండి పోటీ చేయాలనీ చెప్పింది. జోగేశ్వర రావు తనకు మిత్రుడని, ఆయన మీద పోటీకి దిగటం ఇష్టంలేదని చెప్పి త్రిమూర్తులు టీడీపీ నుండే రామచంద్రాపురంలో పోటీ చేసి ఓడిపోయాడు. ఆ తర్వాత వైసీపీ లోకి వెళ్లాల్సి వచ్చింది. మండపేటలో జోగేశ్వర రావు లాంటి బలమైన నేతను ఢీ కొట్టాలంటే తోట లాంటి మరోబలమైన ఆర్థిక శక్తి కలిగిన నేత మాత్రమే సరిపోతాడని భావించిన వైసీపీ మండపేట ఇంచార్జి గా బాధ్యతలు అప్పగించింది. దీనితో తోట తన మిత్రుడైన జోగేశ్వరరావు తో తలపడటానికి సిద్దమయ్యాడు. 

  తాజాగా పేదలకు ఇల్లు నిర్మించి ఇచ్చే విషయంలో ప్రభుత్వం పై ఎమ్మెల్యే జోగేశ్వరరావు విమర్శలు చేయటంతో వాటికీ కౌంటర్ గా “నువ్వు తొడకొడితే.. నేను పడగొడుతా..” అంటూ తోట త్రిమూర్తులు కూడా గట్టిగానే సమాధానం ఇచ్చాడు.. దీనితో ఇద్దరి మధ్య స్నేహం కాస్త వైరంగా మారిపోయింది. వచ్చే ఎన్నికల నాటికీ జోగేశ్వరరావు కు ఎలాగైనా చెక్ పెట్టాలని తోట గట్టిగానే పావులు కదుపుతున్నాడు. ఆయన దూకుడు చూసి స్థానిక వైసీపీ నేతల్లో ఎక్కడ లేని ఉత్సహం వచ్చింది. అదే సమయంలో వలస వచ్చిన నేతను ఎదగనిస్తే తనకు రాజకీయంగా భవిష్యత్తు ఉండదని భావించిన ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు కూడా తోట త్రిమూర్తులను మండపేటలో ఎదగకుండా చేయటానికి తగిన వ్యూహాలు రచిస్తున్నారు.. మరి ఒక్కప్పటి మిత్రుల మధ్య వైరం ఎటు వెళ్తుందో చూడాలి.