రోదసీ యాత్రకు శుభాంశు శుక్లా.. నింగిలోకి దూసుకెళ్లిన ఫాల్కన్ 9 రాకెట్..!

భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్రను విజయవంతంగా ప్రారంభించారు. భారత్‌ కోసం ఇది చారిత్రాత్మక దశగా నిలిచే రోజు. 1984లో వింగ్ కమాండర్ రాకేష్ శర్మ రోదసిలోకి వెళ్లిన తరువాత, దాదాపు నాలుగు దశాబ్దాల అనంతరం ఓ భారతీయుడు అంతరిక్షపు విహారానికి మరోసారి బయలుదేరడం గర్వకారణం.

భారత కాలమానం ప్రకారం మంగళవారం 12:01 గంటలకు శుభాంశు శుక్లా ప్రయాణం ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రారంభమైంది. అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ చేపట్టిన యాక్సియం-4 మిషన్‌లో భాగంగా, ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఈ ప్రయాణం సాగింది. 28 గంటల ప్రయాణం తర్వాత రోజు సాయంత్రం 4:30కి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో డ్రాగన్ వ్యోమనౌక అనుసంధానం కానుంది.

ఈ మిషన్‌లో శుభాంశు శుక్లా పైలట్‌గా వ్యవహరిస్తున్నారు. 39 ఏళ్ల ఈ ఫైటర్ పైలట్‌ను ఇస్రో ప్రత్యేకంగా ఎంపిక చేసింది. ఆయనతో పాటు అమెరికా, పోలాండ్, హంగేరీకి చెందిన ముగ్గురు వ్యోమగాములు ఉన్నారు. నలుగురు సభ్యుల బృందం మొత్తం 60 శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించనున్నారు. వాతావరణం, త్రుటిలో తప్పిన సాంకేతిక లోపాల కారణంగా ఈ మిషన్‌ ప్రయోగం ఆరు సార్లు వాయిదా పడినప్పటికీ, చివరకు జూన్ 25న విజయవంతంగా లాంచ్ చేశారు.

ఈ ప్రయోగానికి భారత్ రూ.550 కోట్లు వెచ్చించిందని తెలుస్తోంది. అంతరిక్ష కేంద్రంలో శుభాంశు శుక్లా 14 రోజుల పాటు గడపనున్నారు. వాతావరణ పరిశోధనలతోపాటు, అంతరిక్ష జీవనంపై ప్రయోగాలు, ఆరోగ్య పరిశీలనలు వంటి అంశాలపై ఈ బృందం శాస్త్రీయ పరిశోధనలు జరగనున్నాయి.

శుభాంశు ప్రయాణం ప్రారంభమైన ప్రదేశం కూడా చారిత్రాత్మకమే. ఇదే లాంచ్‌ప్యాడ్‌ నుంచి 1969లో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే ప్రదేశం నుంచి ఓ భారతీయుడి రోదసి యాత్ర జరగడం గర్వించదగ్గ విషయం. ఈ చారిత్రాత్మక ఘట్టానికి ప్రపంచవ్యాప్తంగా భారతీయులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో “All the best Shubhanshu” అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. భారత్ మరోసారి అంతరిక్ష రంగంలో ముందడుగు వేస్తోందనే గర్వభావాన్ని ఈ ప్రయోగం కలిగిస్తోంది.

ఇప్పుడు వారం పదిరోజులపాటు శుభాంశు శుక్లా అంతరిక్షం నుంచి భారత్ గర్వాన్ని ప్రత్యక్షంగా చూపించబోతున్నారు. ఈ విజయయాత్ర భారత అంతరిక్ష రంగానికి కొత్త ఊపును కలిగించనుంది