చందమామపై అడుగు పెట్టిన వ్యక్తి ఎవరు? అనే ప్రశ్నకు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అని మనం చిన్నప్పటి నుంచీ పుస్తకాల్లో చదువుకుంటూ వచ్చాం. మనదేశం తరఫున రాకేష్ శర్మ కూడా ఆ మిషన్‌లో పాలు పంచుకున్నారు. ఆ తరువాత చంద్రయాన్-1 వరకూ ఇస్రో చంద్రునిపై ప్రయోగాలకు సిద్ధపడలేదు. ఈ సారి తన వైఖరిని మార్చుకుంది. జాబిల్లిపైకి ఏకంగా మనుషులను పంపించడానికి సన్నాహాలు ఇప్పటి నుంచే మొదలు పెట్టింది.
ముగ్గురు వ్యోమగాములను చంద్రునిపైకి పంపిస్తామని, వారిలో మహిళలు కూడా ఉంటారని ఇస్రో ఛైర్మన్ కే శివన్ వెల్లడించారు. 2019లో ఇస్రో కార్యాచరణ ప్రణాళికను ఆయన వివరించారు. ఈ ఏడాది మొత్తం గగన్‌యాన్‌కు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. 2020 డిసెంబర్ నాటికి తొలిదశలో మానవ రహిత రాకెట్‌ను చంద్రునిపై ప్రయోగిస్తామని అన్నారు. ఆ మరుసటి ఏడాది అంటే- 2021 జులై నాటికి ముగ్గురు వ్యోమగాములతో కూడిన అంతరిక్ష వాహక నౌకను చందమామపైకి పంపిస్తామని చెప్పారు.
దీనికోసం కేంద్రం 9,023 కోట్ల రూపాయలను మంజూరు చేయనుందని అన్నారు. దశలవారీగా ఈ మొత్తం తమకు అందుతుందని శివన్ తెలిపారు. ఇస్రో ఈ టార్గెట్‌ను అందుకుంటుందనడంలో ఎవరికీ, ఎలాంటి సందేహాలూ లేవు. ఎందుకంటే ఆ సంస్థకు ఉన్న రికార్డ్ అట్లాంటిది. ఇస్రో చేపట్టిన ప్రతి ప్రయోగమూ సక్సెస్ అయింది. అంతరిక్షంలో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు మన శాస్త్రవేత్తలు. ఈ సారి కూడా వారు ఘన విజయాన్ని అందుకోవడం ఖాయమే. సో- వన్స్ ఎగైన్ బెస్ట్ ఆఫ్ లక్.. ఇస్రో!