విరాట్ వన్ మెన్ షో ..మూడో టీ20లో ఇంగ్లాండ్ ఘనవిజయం !

ఇంగ్లాండ్ తో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఓటమిపాలైంది. ఈ ఓటమితో టీమిండియా బ్యాటింగ్ వైఫల్యం మరోసారి బయటపడింది. ముఖ్యంగా టాపార్డర్ దారుణంగా విఫలమైంది. దీంతో సిరీస్‌ లో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యం సాధించింది. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన మూడో టీ20లో ఇంగ్లాండ్ జట్టు టీమిండియాపై 8 వికెట్ల తేడాతో సునాయాస విజయం సాధించింది. ఇంగ్లండ్ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ (83) బెయిర్‌ స్టో(40) ఇన్నింగ్స్‌ తో ఇంగ్లండ్‌ జట్టు 18.2 ఓవర్లలో భారత్‌ నిర్ధేశించిన 157 పరుగుల లక్ష్యాన్ని చేరుకుంది. భారత బౌలర్లలో చహల్‌, సుందర్‌లకు తలో వికెట్‌ దక్కింది. దీంతో 5 టీ20ల సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా ఆదిలోనే కష్టాల్లో పడింది. కానీ, కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన విరాట్‌ కోహ్లీ (77; 46 బంతుల్లో 8×4, 4×6) మోత మోగించాడు. కళ్లుచెదిరే సిక్సర్లు బాదేశాడు. వరుసగా రెండో అర్ధశతకం చేశాడు. దాంతో 20 ఓవర్లకు భారత్‌ 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. రిషభ్‌ పంత్‌ (25; 20 బంతుల్లో 3×4) కాసేపు అలరించాడు. హార్దిక్‌ (17; 15 బంతుల్లో 2×6) ఫర్వాలేదనిపించాడు. అయితే టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం దక్కలేదు. మార్క్‌వుడ్‌ (3/31) చురకత్తుల్లాంటి బంతులకు రాహుల్‌ (0), ఇషాన్‌ కిషన్ (4)‌, రోహిత్‌ (15) స్వల్ప స్కోర్లకే పెవిలియన్‌ చేరారు.ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 ఇదే వేదికగా మార్చి 18న జరుగనుంది.

గత రాత్రి అహ్మదాబాద్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు 8 వికెట్ల తేడాతో టీమిండియాపై నెగ్గిన సంగతి తెలిసిందే. ఈ విజయం ఇంగ్లండ్ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్లో భారత్ పై 99వది. భారత్ పై అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో ఇంగ్లండ్ రెండో స్థానంలో నిలిచింది. వెస్టిండీస్ కూడా సరిగ్గా అన్నే విజయాలతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉంది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. ఆసీస్ జట్టు భారత్ పై ఇప్పటివరకు 132 విజయాలు నమోదు చేసింది.