ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టు లో టీమిండియా 317 పరుగులతో భారీ విజయం సాధించింది. చెపాక్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమ్ ఇండియా అద్వితీయ విజయం సాధించింది. అశ్విన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇంగ్లాండ్ సుదీర్ఘ ఫార్మాట్‌లో భారీ ఓటమి చవిచూసింది. 482 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో విజృంభించిన.. అక్షర్ 5/60, అశ్విన్ 3/53 మరోసారి చెలరేగారు.
దీంతో భారత్ 317 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 7 వికెట్ల నష్టానికి 116 పరుగులతో లంచ్ విరామానికి వెళ్లిన ఇంగ్లండ్ బ్రేక్ అనంతరం 164 పరుగులు చేసి మిగతా మూడు వికెట్లను కోల్పోయింది. ఈ విజయంతో టీమిండియా నాలుగు టెస్టుల సిరీస్‌ను 1-1 తేడాతో సమం చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లో చివర్లో మెరుపులు మెరిపించిన మోయిన్ అలీ 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మ్యాచ్ మొత్తంలో 8 వికెట్లు తీయడంతో పాటు సెంచరీ చేసిన అశ్విన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.
ఇక రెండో టెస్ట్ మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇంగ్లండ్ జట్టును హడలెత్తించాడు. ఈ మ్యాచ్‌లో 8 వికెట్లు పడగొట్టడమే కాకుండా.. సెకండ్ ఇన్నింగ్స్‌లో 106 పరుగులతో సెంచరీ సాధించి ఔరా అనిపించాడు. టీమిండియా ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలి నుంచే దూకుడు ప్రదర్శిస్తూ ఆడాడు. తన బ్యాట్‌తో వీర విహారం చేశాడు. తొలుత 130 బంతులకే సెంచరీ పూర్తి చేశాడు. సెంచరీ అనంతరం ఆటను నిలకడగా కొనసాగించాడు. మొత్తంగా 231 బంతులు ఆడిన రోహిత్ శర్మ 161 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.