బెబ్బులిలా విజృంభిస్తున్న భార‌త్.. నాలుగు వికెట్లు కోల్పోయిన ప‌ట్టు బిగిస్తున్న టీమిండియా

మొద‌టి టెస్ట్‌లో ఘోరంగా ఓడిపోయిన భార‌త్ రెండో టెస్ట్‌లో ప‌ట్టు బిగిస్తుంది. మెల్‌బోర్న్ వేదిక‌గా జ‌రుగుతున్న ఈ టెస్ట్‌లో భార‌త్ ఆసీస్‌ని 195 ప‌రుగులకి ఆలౌట్ చేసింది. బుమ్రా, అశ్విన్, సిరాజ్ క‌లిసి ఆసీస‌న్ న‌డ్డి విరిచారు. మార్నస్‌ లబుషేన్‌ (48), ట్రావిస్‌ హెడ్‌ (38), మాథ్యూ వేడ్‌ (30) ఫర్వాలేదనిపించగా.. మిగిలినవాళ్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో బుమ్రా 4, అశ్విన్‌ 3, అరంగేట్రం ఆటగాడు సిరాజ్‌ రెండు వికెట్లు ద‌క్కాయి.

ఇక తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భార‌త్ శనివారం ఆట ముగిసే సమయానికి మయాంక్‌ అగర్వాల్‌ (0) వికెట్‌ కోల్పోయి 36 పరుగులు చేసింది. తొలి టెస్టు ఆడుతున్న శుభ్‌మన్‌ గిల్‌ (28 బ్యాటింగ్‌; 5 ఫోర్లు), చతేశ్వర్‌ పుజారా (7 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. ఇక ఆదివారం ఇన్నింగ్స్ ప్రారంభించిన కొద్ది సేప‌టికి శుభ్‌మ‌న్ గిల్(45) రూపంలో భార‌త్ రెండో వికెట్‌ని కోల్పోయింది .కమిన్స్‌ వేసిన బంతి గిల్‌ బ్యాట్‌ ఎడ్జ్‌ను తాకుతూ వెళ్లి వికెట్‌ కీపర్‌ టిమ్‌ పైన్‌ చేతిలో పడింది. అనంత‌రం క్రీజులోకి వచ్చిన అజింక్యా ర‌హానే .. పుజారాతో క‌లిసి ఇన్నింగ్స్ ని చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నం చేస్తున్న క్ర‌మంలో పుజారా మ‌రోసారి క‌మిన్స్ బౌలింగ్ లో దొరికిపోయాడు.

జ‌ట్టు స్కోరు 64 ప‌రుగుల వ‌ద్ద పుజారా 70 బంతులలో 17) మూడో వికెట్‌గా వెనుతిర‌గ‌డంతో టీమిండియా క‌ష్టాల‌లో ఉన్న‌ట్టు క‌నిపించింది. కాని ర‌హానే(23), హ‌నుమ విహారి(21) ఇన్నింగ్స్ ని నెమ్మ‌దిగా ముందుకు న‌డిపించారు. ఇద్ద‌రు మంచిగానే ఆడుతున్నారు అనుకునే క్ర‌మంలో విహారి.. లియాన్ బౌలింగ్‌లో దొరికిపోయాడు. దీంతో 116 ప‌రుగులకు నాలుగో వికెట్ కోల్పోయింది. ప్ర‌స్తుతం పంత్‌..ర‌హానేతో క‌లిసి ఇన్నింగ్స్‌ని ముందుకు తీసుకెళుతున్నాడు. మ‌రో 78 ప‌రుగులు చేస్తే భార‌త్ ఆసీస్ స్కోరుకి స‌మం అవుతుంది.