Crime News: కరోనా విజృంభించిన సమయంలో లాక్ డౌన్ కారణంగా సంపాదన లేక ఎంతోమందికి ఆర్థిక ఇబ్బందుల వల్ల కుటుంబ పోషణ కూడా భారంగా మారింది. ఉన్న ఉద్యోగాలు ఊడిపోయి, కూలి పనులు చేసుకుని వారికి పనులు లేక, వ్యాపారాలు నడవక ఎంతోమంది ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లా లో ఇటువంటి విషాదకర సంఘటన ఒకటి చోటు చేసుకుంది.
వివరాలలోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా చిన్నమంగళాపురం గ్రామానికి చెందిన నాగవరపు రామారావు (47), తవిటమ్మ దంపతులు రెక్కల కష్టం చేసుకొని ఇటుకల బట్టి నడిపేవారు.కుమార్తెకు వివాహం చేయగా కుమారుడు గౌరితో కలసి గ్రామంలో నివాసం ఉంటున్నారు. కరోనా కారణంగా లాక్డౌన్ సమయంలో ఎటువంటి వ్యాపారం లేక ఆర్థిక ఇబ్బందుల వల్ల కుటుంబ పోషణకే అప్పులు చేయాల్సి వచ్చింది. రోజు రోజుకి తీసుకున్న అప్పులకు వడ్డీలు పెరగటంతో అప్పులు తీర్చలేక అప్పు తీసుకున్న వారికి మొహం చూపలేక ఎంతో అవమానంగా భావించారు. అయితే కరోనా తగ్గుముఖం పట్టినా కూడా ఇటుకల బట్టి సరిగా నడవలేక పోవటం వల్ల తీసుకున్న అప్పులు తీర్చలేక పోయారు. దీంతో మనస్థాపం చెందిన దంపతులు తమ సమస్యకు ఆత్మహత్య ఒకటే మార్గం అని నిర్ణయించుకున్నారు.
ఈ తరుణంలో సోమవారం యధావిధిగా అందరితో కలిసి ఉన్న వీరు సోమవారం రాత్రి పొలంలో గడ్డి నివారణకు కోసం ఉపయోగించే మందును ఇంట్లోనే ఇద్దరు కలిసి తాగారు. రాత్రి ఒంటిగంట సమయంలో వారి కుమారుడు నీరు తాగటం కోసం ఇంట్లోకి వెళ్లగా తల్లి,తండ్రులు సృహ లేకుండా ఉండటం గమనించి వెంటనే చుట్టుపక్కల వారికి తెలియచేశాడు. స్థానికులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే రామారావు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. తవిటమ్మ ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం తరలించారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. వీరి మరణంతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.