Pithapuram: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఒకఎత్తు అయితే పిఠాపురం రాజకీయం మాత్రం మరో ఎత్తు అని చెప్పాలి. పిఠాపురం రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్ గానే ఉంటాయి. ఇలా పిఠాపురంలో రాజకీయాలు నిత్యం వార్తలలో నిలవడానికి కారణం అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేయటమే. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ పొత్తులో భాగంగా ఈయన పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.
నిజానికి పిఠాపురం నుంచి టిడిపి తరఫున వర్మ ఎంపిక అవుతారని చివరి క్షణం వరకు ఎదురు చూశారు కానీ పవన్ కళ్యాణ్ కు టికెట్ రావడంతో ఒక్కసారిగా వర్మ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ చంద్రబాబు పిలుపుమేరకు వర్మ పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డారు. తనకు ఎమ్మెల్సీ ఇస్తానని తద్వారా మంత్రిగా తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇవ్వడంతోనే వర్మ ఎలాంటి స్వార్థం లేకుండా పవన్ కళ్యాణ్ గెలుపుకు కారణమయ్యారు. ఇక పవన్ కళ్యాణ్ గెలవడం కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తి కావడం జరిగింది కానీ ఇప్పటివరకు వర్మకు రాజకీయపరంగా ఏ విధమైనటువంటి న్యాయం జరగలేదు.
ఈ క్రమంలోనే పిఠాపురం నియోజకవర్గంలో జనసేన వర్సెస్ టిడిపి అనే విధంగా విభేదాలు చోటు చేసుకున్నాయి. జనసేన పార్టీకి చెందిన నాయకులు ఎప్పటికప్పుడు టిడిపిని తక్కువ చేస్తూ కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో రెండు పార్టీల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. అయితే తాజాగా మరోసారి రెండు వర్గాల మధ్య గొడవలు తారస్థాయికి చేరుకున్నాయి.
తాజాగా పిఠాపురం మార్కెట్ చైర్మన్ పదవి జనసేనకు చెందిన దళిత నాయకురాలు వాకపల్లి దేవికి దక్కింది. ప్రమాణ స్వీకారానికి టిడిపి నేతలను ఆహ్వానించారు. ఆమె ప్రమాణ స్వీకారం చేస్తుండగా ఒక్కసారికి జనసేన నాయకులు జై జనసేన .. పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఇందుకు కౌంటర్ గా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వర్మ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు . దీంతో ఇరువురి మధ్య గొడవ చోటుచేసుకుంది.చివరకు పోలీసులు ఇరు వర్గాలను బయటికి పంపారు. ఇలా పరస్పరం ఈ రెండు పార్టీల మధ్య విభేదాలు చోటు చేసుకోవడంతో పార్టీ అధినేతలు ఈ విషయంపై స్పందిస్తే బాగుంటుందని లేకపోతే ఈ ఐదు సంవత్సరాలు ఇలాగే విభేదాలు కొనసాగుతాయని స్పష్టమవుతుంది.