Crime News: ఈ మధ్య కాలంలో పని చేయటానికి బద్దకించి చాలామంది సులభంగా డబ్బు సంపాదించడం కోసం దొంగతనాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఒంటరిగా ఇంట్లో ఉన్న మహిళలు, వృద్ధులను బెరించి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇటీవల జరిగిన ఒక సంఘటన ఇందుకు నిదర్శనం. తాజాగా అనంతపురం నగర శివారులో ఉన్న ఇంట్లో వృద్ధురాలిని బెదిరించి బంగారు గొలుసు దొంగతనం చేశారు.
వివరాలలోకి వెళితే.. అనంతపురం రూరల్ కక్కలపల్లి కాలనీ సమీపంలోని రజాక్ ఫంక్షన్ హాలు వెనుక ఎల్.రామసుబ్బారెడ్డి, జి.విజయ దంపతులు నివాసం ఉంటున్నారు. వృత్తరీత్యా ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 8 గంటలకు కూతురిని పాఠశాలలో వదిలి ఇద్దరు ఉద్యోగానికి బయలుదేరారు.ఇంట్లో రామ సుబ్బారెడ్డి తల్లి నారాయణమ్మ ఒంటరిగా ఉంది. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి వచ్చి మీ అబ్బాయికి డబ్బులు ఇవ్వాలని చెప్పగా… మ అబ్బాయికి ఫోన్ చేసి చెప్పమంది. ఆ వ్యక్తి ఫోన్ కలవటంలేదని చెప్పటంతో పై అంతస్థులో ఉన్న వారిని కలవమని చెప్పింది.
కొంతసేపటి తర్వాత ఆ వ్యక్తి మంచినీరు కావాలని అడగగా అతికష్టం మీద వాకర్ తో వచ్చి తలుపు తీసి మంచి నీరు ఇచ్చింది. అదే అదునుగా భావించిన వ్యక్తి టీవీ ఆన్ చేసి సౌండ్ ఎక్కువ పెట్టీ వృద్ధురాలిని కత్తితో బెదిరించి ఆమె మెడలో ఉన్న 2.5 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లాడు. అతను వెళ్లగానే వృద్ధురాలు గట్టిగా అరవడంతో పై పోర్షన్లో ఉన్న మహిళ కిందకి వచ్చి ఆమె కుమారుడికి సమాచారం అందించారు. అతను వెంటనే 100 డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుని కోసం గాలిస్తున్నారు.