బెజవాడ దుర్గమ్మ సాక్షిగా జరిగిన గ్యాంగ్ వార్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతటి సంచలనమైందో తెలిసిందే. ముందు ఇది ఓ చిన్న వీధి గొడవగా వెలుగులోకి వచ్చినా.. పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి. ఇది జస్ట్ వీధి వార్ కాదు..గ్యాంగ్ వార్. ఫ్యాక్షన్ యాక్షన్ సినిమాలనే తలపిస్తోందీ కథ. వీళ్లు రెగ్యులర్ గా గొడవ పడే గ్యాంగ్ కాదు. బెజవాడ సిటీనే గడగడలాడిస్తున్న డేంజరస్ గ్యాంగ్ అని తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే…
సందీప్-పండు ఒకప్పుడు మంచి స్నేహితులు.. ఒకే గ్యాంగ్ లో పనిచేసేవారు. చిన్న చిన్న ల్యాండ్ సెటిల్ మెంట్ల నుంచి పెద్ద పెద్ద సెటిల్ మెంట్ల వరకూ డీల్ చేసేవారు. దీంతో ఆ గ్యాంగ్ లోకల్ గా బాగా పాపులర్ అయింది. అయితే అదే సమయంలో ఇద్దరి మధ్య ఆధిపత్యం యుద్ధానికి దారి తీసింది. గ్యాంగ్ కి లీడర్ అనే వాడు ఒకడు ఉండాలి. కానీ అక్కడ లీడర్ సందీప్ నా…పండునా? అన్నదే సందేహంగా మారింది. చిన్నగా మొదలైన ఆ వివాదం ఏకంగా పెద్ద ఉపద్రవాన్నే తెచ్చి పెట్టింది. స్నేహితుల మధ్య ఆధిపత్యం ఆజ్యం పోసింది. చివరికి రెండు గ్యాంగ్ లు గా చీలిపోయారు. అయితే ఇక్కడ బెజవాడ సిటీకి దాదా ఒక్కడే అయ్యి ఉండాలి. అదీ నువ్వా? నేనా ? అనే వరకూ ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి. దీంతో రెండు గ్యాంగ్ లు యుద్దానికి ముహూర్తం పెట్టుకుని మరీ తలపడ్డాయి.
ముందు పండు గ్యాంగ్ ను స్పాట్ కు రమ్మని సందీప్ ఫోన్ చేసాడు. దీంతో పండు గ్యాంగ్ కత్తులు, రాడ్లు, క్రికెట్ బ్యాటులతో స్పాట్ కి చేరుకుంది. అయితే ఆ సమయంలో సందీప్ గ్యాంగ్ ఫోన్ చేసి స్పాట్ మార్చాం. మరో స్పాట్ కి రమ్మని పిలిచారు. దీంతో పండు కోపం కట్టలు తెచ్చుకుంది. ఆవేశంలో గ్యాంగ్ ను వెంటనేసుకుని స్పాట్ కు చేరుకుని నేరుగా సందీప్ గ్యాంగ్ పై మాటా మంతి లేకుండా యుద్దానికే దిగిపోయింది. దీంతో ప్రతి దాడి జరిగింది. ఫలితంగా రాళ్ల దెబ్బలకు తీవ్ర గాయాలపాలైన సందీప్ దుర్మరణం పాలయ్యాడు. పండు ఆసుపత్రి పాలయ్యాడు. ఇదంతా పోలీసు విచారణ లో బయటపడింది. ఇది రామ్ గోపాల్ వర్మ సినిమా స్టోరీనే తలపిస్తోంది కదూ? కేవలం స్నేహితుల మధ్య ఆధిపత్యం గ్యాంగ్ వార్ కి తెర తీసిందన్నది ఈ కథలో అసలు సిసలు ట్విస్టు.
అయితే పండు సోషల్ మీడియా పోస్టులు చెక్ చేస్తే అతని మానసిక స్థితి ఏలా ఉందన్నది తెలుస్తోంది. బెజవాడ తోపు అవ్వాలంటే బలుపుండాలి. ఇక్కడ బ్రతకాలంటే భయంకాదు..బయపెట్టే తత్వం ఉండాలి. నేను కొడితే సింహం పంజా విసిరినట్లు ఉంటుందని బెజవాడలో టాక్ అంటూ కొన్ని పోస్టులు ఉన్నాయి. నాకు చట్టం తెలియదు. నేనే ఓచట్టం. నా బలుపే నా బ్యాంక్ బ్యాలెన్స్. నా ముందు మరొకడు బలుపు చూపిస్తే… పోచమ్మ గుడి ముందు పొట్టేలును కట్టేసినట్లే అంటూ కొన్ని సినిమా డైలాగులు కూడా ఉన్నాయి. దీంతో పండు మానసిక పరిస్థితి దారుణంగా ఉందని పోలీసులు అంచనాకి వచ్చారు.