సుప్రీంకోర్టు స్టే ఇస్తే కొత్త క‌మీష‌న‌ర్ గా ఆయ‌నా?  

ఎస్ ఈ సీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పును స‌వాల్ చేస్తూ జ‌గ‌న్ స‌ర్కార్ సుప్రీం కోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేసిన‌ సంగ‌తి తెలిసిందే. రెండు మూడు నెల‌లుగా న‌లుగుతోన్న ఈ వివాదం సుప్రీంకోర్టుకు వెళ్లేస‌రికి తుది అంకానికి చేరుకుంది. ఈసారి తాడో పేడో తేలిపోవ‌డం ఖాయం. మ‌ళ్లీ సుప్రీంకోర్టుతో వైకాపా స‌ర్కార్ అక్షింత‌లు వేయించుకుంటుందా?  లేక నిమ్మ‌త‌డ్డ‌కే ఝ‌లక్ ఇచ్చేలా తీర్పు ఉంటుందా? అన్న‌ది ప‌క్క‌న‌బెడితే? ఒక‌వేళ ఈ వివాదంపై సుప్రీంకోర్టు స్టే ఇస్తే ప‌రిస్థితి ఏంట‌న్న‌ది ఆస‌క్తిక‌రం గా మారింది.

స్టే ఇస్తే ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుంది?  కొత్త క‌మీష‌న‌ర్ ని నియ‌మిస్తుందా? లేక క్లియ‌రెన్స్ వ‌చ్చే వ‌ర‌కూ వెయిట్ చేస్తుందా? అన్న అనుమానాల నేప‌థ్యంలో మ‌రో ఆస‌క్తిర సంగ‌తి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌స్తుతం రాష్ర్టంలో ఎన్నిక‌ల క‌మీష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీగా ఉంది. క‌న‌గ‌రాజ్ కూడా హైకోర్ట్ తీర్పుతో ప‌ద‌వి కోల్పోయారు. అయితే నిమ్మ‌గ‌డ్డ వ్య‌వ‌హారంలో సుప్రీం  స్టే ఇస్తే గ‌నుక హుటా హుటిన కొత్త క‌మీష‌న‌ర్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మ‌న్మోహ‌న్ సింగ్ ను నియ‌మించేలే ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తులు చేస్తున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. దీనికి సంబ‌ధించి సాధ్యాసాద్యాలు కూడా నిశితంగా న్యాయ‌వాదులు ప‌రిశీలిస్తున్నట్లు స‌మాచారం.

నిమ్మ‌గ‌డ్డ వ్య‌వ‌హారంలో హైకోర్టు కొత్త క‌మీష‌న‌ర్ గా ప్ర‌భుత్వం నియ‌మించ‌కూడ‌ద‌ని తీర్పునిచ్చిన నేప‌థ్యంలో…గ‌త టీడీపీ ప్ర‌భుత్వం నిమ్మ‌గ‌డ్డ‌ను ఎలా నియ‌మించింద‌ని ఏపీ ప్ర‌భుత్వం కోర్టును ప్ర‌శ్నించింది. ఈ ప్ర‌శ్న‌కు కోర్టు నుంచి కూడా స‌రైన స‌మాధానం రాలేదు. అందుకే ప్ర‌భుత్వం హైకోర్టు తీర్పుతో ప‌నిలేకుండా సుప్రీం స్టే ఇస్తే గ‌నుక కొత్త క‌మీష‌న‌ర్ ని య‌మించేలా రంగం సిద్దం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. నేడు జ‌గ‌న్ ఢిల్లీ కి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల హైకోర్టు నుంచి వ‌చ్చిన తీర్పులు..చంద్ర‌బాబు చేస్తోన్న రాజ‌కీయాల‌పై అమిత్ షాతో చ‌ర్చించే అవ‌కాశం ఉంది. అలాగే నిమ్మ‌గ‌డ్డ వ్య‌వ‌హారం కూడా షాతో భేటీ సంద‌ర్భంగా చెప్పే ఛాన్స్  ఉంది.