గత ఎన్నికల్లో ఏపీలో టీడీపీ పార్టీ పరువు కాపాడిన జిల్లాలో ప్రకాశం జిల్లా ఒకటి, జిల్లాలో 12 స్థానాలకు గాను 4 స్థానాల్లో విజయం సాధించి రాష్ట్రము మొత్తం మీద పర్వాలేదనిపించింది. అయితే ఎన్నికల అనంతరం చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం టీడీపీ దూరంగా వైసీపీ కి దగ్గరగా ఉంటున్నాడు. ఇక అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, కొండెపి ఎమ్మెల్యే స్వామి, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు లు టీడీపీ లోనే ఉన్నకాని పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో కనిపించటం లేదు.
ఇప్పటికే కందుకూరు టీడీపీ నుండి పోటీచేసిన పోతుల రామారావు యొక్క ఆర్థిక మూలాలపై దెబ్బ పడటంతో మిగిలిన నేతలు సైలెంట్ అయిపోయారు. ఇలాంటి సమయంలో ఏలూరి సాంబశివరావు కు బాపట్ల పార్లమెంట్ అధ్యక్ష పదవి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. కానీ ఏలూరి మాత్రం ఆ పదవి తనకు వద్దో మొర్రో అంటూ చంద్రబాబుకు మొరపెట్టుకున్నట్లు తెలుస్తుంది,కానీ బాబు మాత్రం తప్పనిసరిగా వుండాలసిందే అంటూ హుకం జారీచేసినట్లు నియోజకవర్గంలో మాటలు వినిపిస్తున్నాయి. పిలిచి మరి అధ్యక్ష పదవి ఇస్తుంటే వద్దంటూ ఏలూరి ఎందుకు వెనక్కి వెళ్తున్నాడు అని ఆలోచిస్తే, దానికి బలమైన కారణం ఉందని తెలుస్తుంది.
ఏలూరి వివిధ రకాలైన వ్యాపారాలు వున్నాయ్. అందులో ఎరువులు, ట్రాక్టర్ల వ్యాపారం బాగా జరుగుతుంది. ఎదో ఎమ్మెల్యే పదవి అడ్డం పెట్టుకొని మెల్లగా వైసీపీ కంటిలో పడకుండా వ్యాపారం చేసుకుంటున్నాడు. ఎప్పుడైతే అధ్యక్ష పదవి తీసుకుంటాడో ఇక అప్పటి నుండి తప్పకుండా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. అదే కనుక చేస్తే వైసీపీ ప్రభుత్వం తనమీద దృష్టి సారించే అవకాశం లేకపోలేదు. బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ కు సీఎం జగన్ తో దగ్గరి సంబంధాలు వున్నాయి, పోయిపోయి అదే పార్లమెంట్ స్థానానికి అధ్యక్షుడిగా వెళితే నిప్పుతో తలగోక్కున్నట్లే లెక్క. అందుకే ఏలూరి తనకు ఎలాంటి పదవులు వద్దంటూ దూరంగా ఉంటున్నాడు.
ఇక ఏలూరి కాకపోతే ఆ పదవికి సరిపోయిన నేత మరొకరు కనిపించకపోవటంతో బాబు కూడా ఏలూరి విషయంలో పంతంగానే ఉన్నాడు .అధ్యక్ష పదవులు ప్రకటించి చాలా రోజులు అవుతుంది. ఇప్పటికే చాలా వరకు నేతలు వాటి బాధ్యతలను స్వీకరించారు. కానీ ఏలూరి మాత్రం ఇంతవరకు వాటి జోలికెళ్లలేదు. దీనితో ఆయన్ని బుజ్జగించే బాధ్యత నారా లోకేష్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఏలూరి , లోకేష్ కి మధ్య మంచి సంబంధాలు వున్నాయి. మరి లోకేష్ మాటను కాదనలేక అధ్యక్ష పదవి తీసుకుంటాడో లేడో చూడాలి.