సంక్షేమం మాటున, ‘ఉచిత’ పథకాల వైపు రాజకీయ పార్టీలు మొగ్గు చూపుతున్నాయి. ఓ రాష్ట్ర బడ్జెట్ ఎంత.? అన్న ఆలోచన లేకుండా రాజకీయ పార్టీలు అధికారమే పరమావధిగా, ఎన్నికల్లో ‘ఉచిత’ హామీలు ఇచ్చేస్తున్నాయ్. దాంతో, రాష్ట్రాలు, దేశం.. అప్పుల మీద అప్పులు చేయాల్సిన పరిస్థితి.
అసలు, ఏ సంక్షేమ పథకమైనా లబ్దిదారుడికి ఎలా చేరుతుంది.? ఎలా మేలు చేస్తుంది.? నో డౌట్, ఏ సంక్షేమ పథకం కూడా ఇప్పుడున్న రోజుల్లో సామాన్యుడికి మేలు చేయదు. ఎందుకంటే, అభివృద్ధిని విస్మరించి నడుస్తోన్న సంక్షేమమిది.
అభివృద్ధి పలాలతో సంక్షేమం అమలు చేస్తే, రాష్ట్రమైనా దేశమైనా బాగుపడుతుంది. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. ఉచిత కోవిడ్ 19 వ్యాక్సిన్ల విషయానికొస్తే, ఒక్కో వ్యాక్సిన్ ఖరీదెంత.? దాని చుట్టూ జరిగిన రాజకీయమెంత.? ఓ సామాన్యుడు భరించగలిగే స్థాయిలోనే వ్యాక్సిన్ ధర ప్రస్తుతం వుంది.
కానీ, కోవిడ్ వ్యాక్సినేషన్ ఉచితంగా జరిగింది. అంటే, కేంద్రంపై భారం పెరిగింది. ఆ లోటుని కేంద్రం పూడ్చుకోవాలంటే ఏం చేస్తుంది.? పన్నుల మోత మోగిస్తుంది. రాష్ట్రాలైనా అంతే. కొందరికి పంచే సంక్షేమ పథకాల భారం అందరి మీదా పడుతుంది. మరీ ముఖ్యంగా ట్యాక్స్ పేయర్ జీవితం సర్వనాశనమైపోతోందన్న విమర్శలు లేకపోలేదు.
సర్వోన్నత న్యాయస్థానంలో ఈ ఉచిత వ్యవహారంపై విచారణ జరుగుతోంది. ముందు ముందు రాజకీయ పార్టీలు సంక్షేమ పథకాల్ని అమలు చేయలేని స్థాయికి ఆర్థిక సంక్షోభం రాబోతోంది. అదే జరిగితే, సంక్షేమం ఆగిపోతే.? ఏమవుతుంది. రాజకీయ పార్టీలు చచ్చిపోతాయ్.!