Naga Mahesh: కల్యాణ్ గారిని కలుద్దామని బీమ్లానాయక్‌ సెట్‌కి వెళ్తే.. త్రివిక్రమ్ పిలిచి ఏమన్నారంటే!

Naga Mahesh: ఓ రోజున పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ గారిని కలవాలనే ఉద్దేశంతో బీమ్లానాయక్ షూట్ లోకేషన్‌కు వెళ్లామని ప్రముఖ ఆర్టిస్ట్ నాగ మహేశ్ అన్నారు. తీరా అక్కడ సెట్‌లో నుంచి బయటికొచ్చింది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అని ఆయన చెప్పుకొచ్చారు. ఆయనకు నమస్కారం పెట్టగానే, ఏమండీ అరవింద తర్వాత ఇప్పుడే కలవడం అన్నారని మహేశ్ తెలిపారు. తనను చూడగానే అలా గుర్తుపట్టి పలకరించడం చూసి తనకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదని, అలాగే చూస్తుండిపోయి అవున్ సర్ అని అన్నానని ఆయన చెప్పారు.

ఇకపోతే మీరు ఈ మధ్య చేసిన సినిమాల్లో చూశాను చాలా బాగా చేస్తున్నారు. ఉప్పెన సినిమాలో కూడా చాలా బాగా నటించారు. బేసిగ్గా మీరు చాలా మంచి వ్యక్తి అండీ. కానీ యజమాని ఏం చేయమంటే అది చేసే రకం. చాలా బాగా మీ భావాన్ని వ్యక్తం చేశారు. మీ పాత్రను చూశాక మా ఊళ్లో ఉండే ఓ ఇద్దరు గుర్తొచ్చారు. ఇప్పటికీ వాళ్లున్నారు. అంటే వాళ్లలా అనిపించారు. వాళ్లను గుర్తుచేశారు మీరు. అంత బాగా నటించారు మీరు, అని త్రివిక్రమ్ శ్రీనివాస్ తనతో అన్నట్టు నాగ మహేశ్ తెలిపారు.

అంతే కాకుండా ఆ సెట్‌లో దిల్‌ రాజు గారు కూడా ఉన్నారన్న మహేశ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ వకీల్ సాబ్ అని అనగానే అది చాలా చిన్న వేషం సర్ అని అంటే, దానికి ఆయన ఎంత ఇంటెన్సిటీతో చేశారు మీరు అని తనను ప్రశంసించినట్టు నాగ మహేశ్ తెలిపారు. అయినా చిన్న వేషం అని ఎవరు చెప్పారు. ట్రైలర్‌లో కూడా వేశారు కదా మిమ్మల్ని. ఆ డైలాగ్ చెప్పే తీరులోనే ఎంత సీరియస్‌ మ్యాటరో, ఎంత మంచి మనిషో అనేది తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో కూడా బాగా చేస్తారు అని కో – డైరెక్టర్ గారిని పిలిచి మహేశ్ గారి నెంబర్ తీసిపెట్టుకోండి. మనకు ఫ్లాష్‌బ్యాక్‌లో అవసరం అవుతారీయన అని చెబితే తాను దండంపెట్టి, సర్ అడక్కుండానే వరమిస్తున్నారు అని అన్నట్లు మహేశ్ తెలిపారు. దానికి ఆయన మాక్కూడా ఆర్టిస్ట్‌ కావాలి కదా సర్ అన్నారని ఆయన తెలిపారు. అంత గొప్పగా అడక్కుండా వచ్చిన అవకాశం ఎదురు పడితే పట్టుకోలేని స్థితిలో తానున్నానని ఆయన చెప్పారు. ఇదంతా కూడా బీమ్లానాయక్‌ సెట్‌లోనే జరిగిందని, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ గారే స్వయంగా అలా చెప్పారని ఆయన స్పష్టం చేశారు. కానీ ఆ సమయానికి తాను అందుబాటులో లేక చేయలేకపోయాననే బాధ మాత్ర ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.