ఐఏఎస్ శ్రీలక్ష్మి గురించి అందరికీ పరిచయం ఉంది. 1988 బ్యాచ్ కు చెందిన ఈమె చిన్న వయసులోనే ఐఏఎస్ సాధించి ఫేమస్ అయ్యారు. అయితే ఎంతగా ఫేమస్ అయ్యారో అంత తీవ్రమైన వివాదాల్లోనూ చిక్కుకున్నారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీలక్ష్మి ఓ వెలుగు వెలిగారు. గనులశాఖ కార్యదర్శిగా పనిచేశారు. అప్పట్లో ఓబుళాపురం మైనింగ్ అనుమతుల విషయంలో క్యాప్టివ్ మైనింగ్ అనే పదాన్ని తొలగించడం ద్వారా గాలి జనార్ధనరెడ్డికి భారీగా లబ్ధి చేకూరింది. దీంతో శ్రీలక్ష్మి అవినీతికి పాల్పడినట్లు ఆరోపణల వచ్చాయి. వైఎస్ మరణం తర్వాత సీబీఐ మైనింగ్ తో పాటు జగన్ పై అక్రమాస్తుల కేసులు నమోదు చేయడంతో శ్రీలక్ష్మి జైలు కూడా వెళ్లాల్సి వచ్చింది.
ఆ తర్వాత విడుదలైన ఆమెను తెలంగాణ కేడర్ కు కేటాయించారు. కానీ శ్రీలక్ష్మి విధులకు వేళలకుండా ఏపీకి డిప్యుటేషన్ మీద రావాలని తీవ్రంగా ప్రయత్నించారు. నాయకులు సిఫార్సులు కూడ పనిచేయడంతో ఆమెను ఏపీకి బదిలీ చేసింది క్యాట్. జగన్ సీఎం కావడంతో శ్రీలక్ష్మికి మళ్ళీ ఆశలు చిగురించి ఏపీకి రాగలిగారు. ఏపీకి వచ్చిన వెంటనే ఆమెను పురపాలక శాఖకు కార్యదర్శిగా నియమించింది ప్రభుత్వం. ఇది జరిగి కొన్ని నెలలు కూడ కాకముందే జగన్ ఆమెకు ఇంకో పెద్ద ప్రమోషన్ ఇచ్చారు. ఈసారి కార్యదర్శి పదవి నుండి ముఖ్య కార్యదర్శిగా నియమించారు.
ఈ మేరకు ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు. శ్రీలక్ష్మి మీద ఉన్న పెండింగ్ కేసుల తీర్పులు, డీవోపీటీ నిర్ణయం మేరకు అమలు జరుగుతుందని, తుది తీర్పులకు లోబడే ఉత్తర్వుల కొనసాగింపు ఉంటుందని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెల్లడించారు. దీనిబట్టి నిబంధనలకు అనుగుణంగా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా సిఎస్ చాలా జాగ్రత్తగా వ్యవహరించినట్టు అర్థమవుతోంది. ఏమైనా జగన్ కు సంబంధించిన కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొని జైలుపాలై, ఆరోగ్యం దెబ్బతిని తీవ్ర వేదనకు గురైన శ్రీలక్ష్మికి అవకాశం చూసుకుని జగన్ బంగారంలాంటి పదవినే ఇచ్చారు.