Khushbu Sundar: ఖుష్బూ.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు బుల్లితెరపై పలు షో లకు జడ్జిగా వ్యవహరిస్తూనే రాజకీయాలలో ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు ఖుష్బూ. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో జరిగే పలు విషయాలపై స్పందిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోని అప్పుడప్పుడు పలు కాంట్రవర్సీలలో కూడా నిలుస్తూ ఉంటారు ఖుష్బూ. ఇది ఇలా ఉంటే తాజాగా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఫోన్ లో చెప్పిన మాటలు వాస్తవమేనని,అయినప్పటికీ ఫోన్ సంభాషణను ఈ విధంగా రికార్డు చేయడం బాగోలేదని ఆమె మండిపడ్డారు.
కాగా తమిళనాడులో చోటు చేసుకున్న పరిణామాలపై స్పందించమని కోరుతూ స్థానిక మీడియా సంస్థ ఫోన్ కాల్‌లో ఆమెను సంప్రదించింది. భాజపా ఆధ్వర్యంలో ఆ రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలకు దూరంగా ఉండటంపై విలేకరి ఆమెను ప్రశ్నించాడు. దీనిపై ఖుష్బూ స్పందిస్తూ.. తమిళనాడు భాజపా తనని పట్టించుకోవడం లేదని తెలిపారు. దీనికి సంబంధించిన ఆడియో రికార్డ్ ను సదరు మీడియా సంస్థ ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. ఆమె అనుమతితోనే దీనిని రిలీజ్ చేస్తున్నామని తెలిపింది. దీనిపై తాజాగా ఆమె స్పందించారు. మరి ఇంత దిగజారుతారని అనుకోలేదు. నా అనుమతి తీసుకోకుండా ఈ విధంగా నా వాయిస్ ఎలా రికార్డు చేస్తారు? కానీ నేను నిజమే చెప్పా.
భాజపా కార్యక్రమాల్లో మీరెందుకు కనిపించడం లేదని నన్ను ఎవరైనా ప్రశ్నిస్తే.. వారందరికీ ఒక్కటే సమాధానం చెబుతాను. ఆయా కార్యక్రమాలకు సంబంధించి నాకు ఎలాంటి సమాచారం ఇవ్వరు. వాటికి నన్ను ఆహ్వానించరు. ఒకవేళ సమాచారం ఇచ్చినా చివరి నిమిషంలో చెబుతారు. కొంతమంది ఊహిస్తున్నట్లు నేను అయితే పార్టీని వీడటం లేదు. ప్రధాని నరేంద్రమోదీ విజన్, ఆయన ప్రవేశ పెడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు నిరంతరం శ్రమిస్తాను అని ఖుష్బూ తెలిపారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఖుష్బూ అనుమతితోనే తాను ఇది షేర్ చేశామని మీడియా సంస్థ పేర్కొనడంపై ఆమె మరోసారి స్పందించారు. ఆ సంస్థ చెబుతున్న దానిలో నిజం లేదు. ఈ విషయాన్ని వారు నా దృష్టికి ఏమాత్రం తీసుకురాలేదు. ఫోన్ కాల్ రికార్డు చేస్తున్నామని మీరు నాకెప్పుడు చెప్పారు? అని ప్రశ్నిస్తూ మరో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.