Koushal: టీవీ నటుడు, మోడల్ కౌశల్ బిగ్‌బాస్ షో విన్నర్ కావడంతో ఊహించని రేంజ్‌లో పాపులారిటీని సొంతం చేసుకున్నారు. అది కూడా కేవలం ఒకే ఒక్క నిమ్మకాయ ఎపిసోడ్‌తో తిరిగిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఫలితంగా ఆయన బిగ్‌బాస్ సీజన్-2 విన్నర్‌గా టైటిల్ సొంతం చేసుకొని, తనకంటూ స్టార్ ఇమేజ్ స్థాయిని ఏర్పరుచుకున్నారు. అయితే బిగ్‌బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ సెలబ్రెటీల లైఫ్‌లో చేంజ్ వస్తుందని నమ్మే అభిమానులు.. కౌశల్ విషయంలో మాత్రం పెద్ద మార్పును చూడలేకపోయినట్టే చెప్పుకోవచ్చు. కారణం ఆయనకు వస్తున్న అవకాశాలే. అయితే తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కౌశల్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఇక అసలు విషయానికొస్తే అప్పుడప్పుడూ సంచలన కామెంట్స్ చేస్తూ వార్తల్లో కౌశల్.. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ట్రెండింగ్‌గా మారాయి. తన క్రేజ్, ఇమేజ్‌కు తగ్గట్టు నిర్మాతలు రెమ్యునరేషన్ ఇవ్వలేకపోతున్నారని, అందుకే తనకు ఎన్ని అవకాశాలు వచ్చినా తాను ఇంట్రస్ట్ చూపించడం లేదని కౌశల్ తెలిపారు. బిగ్‌బాస్ షో తర్వాత తమ జీవితం మారిపోతుందని అంటారు గానీ, తన విషయంలో మాత్రం అలా జరగలేదని ఆయన చెప్పారు. అంతకుముందు వరకు దాదాపు 86 చిత్రాల్లో నటించానన్న కౌశల్, ఆ షో నుంచి వచ్చాక పెద్దగా సినిమాలేవీ చేయలేదని ఆయన అన్నారు.
ఇకపోతే తానెప్పుడూ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ దగ్గరికెళ్లి అవకాశాలివ్వమని అడగనని, ఎవరైనా తన టాలెంట్ చూసి అవకాశం ఇస్తే చేస్తానని ఆయన చెప్పారు. అంతేగానీ తానే స్వయంగా వెళ్లి ఛాన్స్ ఇవ్వమని కోరనని ఆయన స్పష్టం చేశారు. అలా కొందరు అడుక్కుంటారు గానీ, తాను మాత్రం అలా కాదని ఆయన చెప్పుకొచ్చారు.