Roja Movie: తనకు ఎప్పటినుంచో మణిరత్నం సినిమాలో చేయాలని ఉండేదని, కానీ కొన్ని కారణాల వల్ల మిస్ అయ్యాయని ప్రముఖ నటుడు ఆనంద్ భారతి అన్నారు. అప్పటికే బాలచందర్‌తో సినిమా చేసి ఉన్నానని, ఇక తర్వాతి చిత్రమైనా మణిరత్నంతో అయితే బాగుండు అనుకుంటున్న సమయంలో ఆయన తీస్తున్న ఓ సినిమాలో తాను ఓ ఫ్రెండ్ క్యారెక్టర్ చేయడానికి వెళ్లానని ఆయన చెప్పుకొచ్చారు. కానీ అప్పటికే తాను కొన్ని సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ చేసి ఉన్నానని, హీరో కూడా చేశానని ఆ సినిమా నుంచి బయటికి వచ్చేసినట్టు ఆయన తెలిపారు.
ఆ తర్వాత మణిరత్నం తీసిన అంజలి సినిమాలో తాను చేశానని ఆనంద్ భారతి చెప్పారు. ఆ చిత్రంలో పెద్ద రోల్ ఏమీ కాదని, ఓ సాంగ్ మాత్రమే చేశానని ఆయన చెప్పారు. కానీ మణిరత్నం సినిమాలో తాను ఎలాగైనా రావాలనే ఒకే ఒక ఉద్దేశంతో అది చేశానని ఆయన వివరించారు.
ఇకపోతే ఆ తర్వాత ఆయన తీసిన రోజా సినిమాకు కూడా తనను పిలిచినట్టు ఆనంద్ భారత్ తెలిపారు. నిజానికి ఆ మూవీలో అరవింద స్వామినే హీరోగా ఫిక్స్ చేశారు. కానీ అతని ఫాథర్‌కు కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా ఆయన చేయడానికి కుదరడం లేదని, ఆ క్యారెక్టర్ చేయడానికి తనను పిలిచారని ఆయన చెప్పారు. దానికి గానూ స్ర్కీన్ టెస్ట్ కూడా చేశారని, ఆ తర్వాత మళ్లీ కబురు చేస్తామని చెప్పినట్టు ఆయన తెలిపారు. అలా జరిగిన రెండు రోజులకు మళ్లీ అరవింద స్వామి నటిస్తానని ఒప్పుకున్నారని ఆనంద్ భారతి చెప్పారు. అలా రోజా సినిమా కూడా చేజారిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత అదే విషయాన్ని మణిరత్నం గారిని అడిగానని, ఎప్పుడు సర్ నేను మీ చిత్రంలో చేస్తాను అని అడిగితే, నెక్స్ట్ పిక్చర్ నువ్వు చేద్దువుగాని అని అన్నట్టు ఆయన వివరించారు.
అది జరిగిన తర్వాత ఆయన తీసే చిత్రంలో ప్రశాంత్ హీరో అని తెలిసి చాలా బాధపడ్డానని ఆనంద్ భారతి అన్నారు. కానీ తాను ఒక రోజు జిమ్ ఉన్నపుడు ఆయన నుంచి ఫోన్ వచ్చిందని.. అలా మళ్లీ ఆయన్ని కలవడం, స్ర్కీన్ టెస్ట్ చేయడం జరిగాయని ఆయన చెప్పారు. ఫైనల్ ఆ సినిమాలో అలా తనకు మణిరత్నం సినిమాలో నటించే అవకాశం వచ్చిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.