హైద్రాబాద్ పేరులో ఏముంది.? పేరు మార్చితే ఏమవుతుంది.?

Hyderabad

ఒక్కో ప్రాంతానికీ ఓ ఐడెంటిటీ వుంటుంది. దాని ప్రకారమే ఆయా ప్రాంతాలకు ఆయా పేర్లు వస్తుంటాయి. వాటిని మార్చేయడం ద్వారా ఆ ప్రాంతానికి తామేదో అదనపు ప్రయోజనం కల్పించేసినట్లు అధికారంలో వున్న పార్టీలు భావిస్తుంటాయి.

తెలంగాణలో కొమరం భీమ్, జయశంకర్ పేర్లు పెట్టినా, ఆంధ్రప్రదేశ్‌లో అల్లూరి, ఎన్టీయార్, అంబేద్కర్ పేర్లను ఆయి జిల్లాలకు పెట్టినా, ఇదంతా ఓ రాజకీయ క్రీడ. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. జిల్లాలకు పేర్లు పెట్టడమేంటి.? సంక్షేమ పథకాలకు ఎందుకు మహనీయుల పేర్లు పెట్టరు.? అంటే, దానికి ఏ రాజకీయ పార్టీ దగ్గరా సమాధానం వుండదు.

ఇప్పుడు భాగ్యనగరం హైద్రాబాద్ పేరుని మార్చేస్తామంటోంది బీజేపీ. హైద్రాబాద్‌ని భాగ్యనగరంగా చాలామంది అభివర్ణిస్తుంటారు. ఆ హైద్రాబాద్ పేరుని పూర్తిగా భాగ్యనగరంగా మార్చేస్తామన్నది బీజేపీ ఉవాచ. ‘అలా ఎలా మార్చుతారు.?’ అంటోంది తెలంగాణ రాష్ట్ర సమితి. ఏం, ఎందుకు మార్చకూడదు.? అన్న చర్చ సహజంగానే తెరపైకొస్తుంది.

వాళ్ళెవరు మార్చడానికి.? అంటూ టీఆర్ఎస్ గుస్సా అవుతోంది. బీజేపీ గనుక తెలంగాణలో అధికారంలోకి వస్తే, హైద్రాబాద్ పేరు మారిపోతుంది. ఇందులో సందేహమేముంది.? అధికారం చేతిలో వుంటే ఏదైనా చేయొచ్చు. అదే కదా, ఆ ‘పేరు మార్పు’ రాజకీయమే కదా నడుస్తోంది.? పేరు మారుతుందేమోగానీ, ఆ పేరు మార్పు వల్ల ఆయా జిల్లాలు, నగరాల రూపురేఖలేమీ మారిపోవు కదా.?