2 రోజుల క్రితం కేటీఆర్‌ను కలిసిన మేయర్‌కు కరోనా పాజిటివ్ 

Hyderabad mayor tests positive for Corona virus

హైదరాబాద్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా సోకింది.  తాజాగా నిర్వహించిన కోవిడ్ పరీక్షలో ఆయనకు పాజిటివ్ వచ్చినట్టు వైద్యులు ప్రకటించారు.  ఎలాంటి లక్షణాలు లేకుండానే ఆయనకు పాజిటివ్ రిపోర్ట్స్ రావడంతో మొత్తం ఆయన కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించారు.  వారికి మాత్రం నెగెటివ్ వచ్చినట్టు వైద్యులు తెలిపారు.  ప్రస్తుతం మేయర్ స్వీయ నిర్భంధంలో ఉన్నారు.  అయితే మేయర్ నిన్నటి వరకు చాలా చురుగ్గా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.  

ఈ నెల 24న మంత్రి కేటీఆర్ పుట్టినరోజు కావడంతో మేయర్ నేరుగా వెళ్లి కలిసి శుభాకాంక్షలు చెప్పారు.  అంతేకాదు మూడు రోజుల క్రితం నల్గొండ క్రాస్ రోడ్స్ నుండి ఒవైసీ జంక్షన్ వరకు నిర్మించిన తలపెట్టిన ఎలివేటర్ కారిడార్ శంఖుస్థాపన కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.  ఆ వేడుకకు కూడా మేయర్ అటెండ్ అయ్యారు.  దీంతో పార్టీ వర్గాల్లో ఆందోళన నెలకొంది.  ఇంకా మేయర్ ను పలువురు అధికారులు, నేతలు కూడా కలిశారు.  వారంతా ఇప్పుడు పరీక్షలు చేయించుకునే పనిలో ఉన్నారు.  
 
కొన్ని రోజుల క్రితం సిటీలో జరిగిన స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమంలో మేయర్ ఒక టీ స్టాల్ వద్ద ఆగి టీ తాగాడు.  ఆ టీ స్టాల్ నందు పనిచేసే మాస్టరుకు కరోనా నిర్థారణ కావడంతో మేయర్ పరీక్షలు చేయించుకున్నారు.  అందులో నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి.  మళ్లీ కొన్ని రోజులకు తన కారు డ్రైవర్ కూడ కరోనా పాజిటివ్ అని తెలియడంతో మరోసారి  ఆయన కుటుంబసభ్యులతో కలిసి పరీక్షలు చేయించుకున్నారు.  అందులో కూడా నెగెటివ్ అనే వచ్చింది.  కానీ ఎలాంటి లక్షణాలు లేకుండానే ఈరోజు చేయించుకున్న పరీక్షల్లో పాజిటివ్ అని నిర్థారణ కావడం గమనార్హం.