హుజూరాబాద బై పోల్.. బెట్టింగ్ యమా హాట్ గురూ.!

ఇండియా – పాకిస్తాన్ జట్ల మధ్య ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ విషయంలో విపరీతమైన బెట్టింగ్ జరిగింది. వందల కోట్లు చేతులు మారాయ్. అంతకు మించి అనే స్థాయిలో ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయమై బెట్టింగ్ జరుగుతోందట. తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్‌లోనూ హూజూరాబాద్ ఉప ఎన్నికలో గెలుపెవరిదన్నదానిపై బెట్టింగ్ జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది.

తాజా అంచనాల ప్రకారం వంద కోట్లపైనే బెట్టింగ్ హుజూరాబాద్ ఉప ఎన్నికలపై జరగొచ్చని అంటున్నారు. పోటీ ప్రధానంగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితికీ, బీజేపీకీ మధ్య నడుస్తున్న విషయం విదితమే. అయితే, రేసులో తామూ వున్నామంటోంది కాంగ్రెస్ పార్టీ.

సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మంత్రి పదవిని కోల్పోయి, అధికార తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి బయటకు వచ్చి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక జరగుతోంది. ఈటెలను దారుణంగా వేధించి మంత్రి పదవి నుంచి తొలగించారన్న చర్చ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న విషయం విదితమే.

ఈ నేపథ్యంలోనే హుజూరాబాద్ ఉప ఎన్నిక అత్యంత వాడి వేడిగా జరగనుంది. బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ బరిలోకి దిగారు. ఆయన ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్ర కూడా చేపట్టారు. మరోపక్క గెలుపు కోసం టీఆర్ఎస్ – బీజేపీ పోటాపోటీగా ఖర్చు చేస్తున్నాయి.

తెలంగాణ రాజకీయాల్లోనే అత్యంత ఖరీదైన ఉప ఎన్నికగా హుజూరాబాద్ ఉప ఎన్నిక గురించి నియోజకవర్గంలో చర్చించుకుంటుండడం గమనార్హం. ‘ఈ ఉప ఎన్నిక చాలా లాభదాయకంగా మారింది..’ అంటూ హుజూరాబాద్ జనాలు మాట్లాడుకుంటున్నారంటే, పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు ఇప్పుడు బెట్టింగ్ రగడ.! ఈ రాజకీయం అదుర్స్ కదూ.!