వంద నోటు ఊసే లేదు.. ఐదొందల నోటు ఇలా తీస్తే, అలా గల్లంతైపోతోంది. వెయ్యి రూపాయల నోటు ప్రస్తుతానికి లేదుగానీ.. లేకపోతే, చాలా సులువుగా వుండేదేమో రాజకీయ పార్టీలకి. ఔను మరి, రెండు ఐదొందల రూపాయల నోట్ల కంటే, ఒక్క వెయ్యి నోటు క్యారీయింగ్ తేలిగ్గా వుండేది కదా.!
హుజూరాబాద్ ఉప ఎన్నిక వేళ అక్కడ వినిపిస్తున్న ముచ్చట సారాంశమిది. ఈటెల రాజేందర్ వర్సెస్ తెలంగాణ రాష్ట్ర సమితి.. అన్నట్టు జరుగుతోంది హుజూరాబాద్ ఉప ఎన్నిక. సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ రాజీనామాతో తలెత్తిన ఉప ఎన్నిక ఇది. అయితే, ఈటెల రాజేందర్ గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి గెలిచారిక్కడ. అదే అసలు సమస్య.
ఎలాగైనా, హుజూరాబాద్ నియోజకవర్గాన్ని నిలబెట్టుకోవాలని గులాబీ పార్టీ భావిస్తోంది. తన గెలుపు నల్లేరు మీద నడక అని భావిస్తున్నారు ఈటెల రాజేందర్. పైకి ధీమా వ్యక్తం చేస్తున్నా, తెరవెనుక ఇరు శిబిరాల్లోనూ బోల్డన్ని అనుమానాలున్నాయ్.
పోటా పోటీగా ఇరు పక్షాలూ డబ్బు కుమ్మరించేస్తున్నాయి హుజూరాబాద్ నియోజకవర్గంలో. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం రాత్రి.. ఇలా నాలుగు షిఫ్టుల్లో ‘కార్యకర్తలకు’ చెల్లింపులు చేయాల్సి వస్తోంది. ఓ వ్యక్తి కనీసం రెండు షిఫ్టుల్లో పనిచేస్తున్నాడట. ఒకే వ్యక్తి రెండు మూడు పార్టీలకు ఒకే రోజు ప్రచారం చేసేస్తున్న వైనం హుజూరాబాద్‌లో కనిపిస్తోంది.
హీనపక్షం 1500 నుంచి 2000 వరకు గిట్టబాటవుతోందట ఇలా రాజకీయ పార్టీల తరఫున ప్రచారం చేసినందుకుగాను.! పోలింగ్ రోజున పంచే కరెన్సీ నోట్ల వ్యవహారమెలా వుంటుందో అంచనా వేయడమే కష్టంగా మారిందిప్పుడు.
దేశంలోనే అత్యంత ఖరీదైన ఉప ఎన్నిక.. అని ఇప్పటికే హుజూరాబాద్ ఉప ఎన్నిక గురించి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న విషయం విదితమే.