త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పార్టీలు హోరాహోరీగా రెడీ అవుతున్నాయి. ఎవరికివారు అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉన్నారు. ప్రధానంగా ఏకగ్రీవాల మీద దృష్టి పెట్టారు. ఏకగ్రీవాలు అంటే ఎక్కువగా జరిగేది అధికార పార్టీ తరపునే. ఈ ఎన్నికల్లో వైసీపీ తరపున ఏకగ్రీవ ఎంపికలు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలను ఇస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. అయితే అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో జరుగుతున్న ఈ ఎంపికలు పెద్ద వ్యాపారాన్ని తలపిస్తున్నాయని చెబుతున్నారు. పార్టీకి పూర్తి ఆధిపత్యం ఉన్న నియోజకవర్గాల్లో సర్పంచ్ పదవులకు వేలం జరుగుతోందట.
అధికార పార్టీ సర్పంచ్ అంటే ఆ వేలావ్, పలుకుబడి వేరే లెవల్లో ఉంటుంది. అధికారం, దర్పం, రాజకీయ ప్రయాణానికి గట్టి పునాది ఉంటాయి. అందుకే రాజకీయాల మీద మోజు ఉన్నవాళ్లు వేలం పాటలో పోటీపడుతున్నారట. ఒక జిల్లాలో ఏకగ్రీవం సర్పంచ్ రేటు 30 లక్షలు పలికితే ఇంకొక చోట ఏకంగా 50 లక్షలు తాకిందట. బయటికొచ్చేవి కొన్నే అయితే రానివి ఇంకెన్నో ఊహించుకోవచ్చు. నియోజకవర్గం స్థాయిని బట్టి, పోటీని బట్టి ఈ రేట్లు ఉంటాయి. ఈ వేలం పాటలో మాత్రం తమ పర బేధాలే ఉండట్లేదట. పాడుకున్నవారికే పదవి. రేటు ఇంత భారీగా ఉన్నా వ్యక్తులు మాత్రం వెనుకాడట్లేదట.
ఇంకొన్ని చోట్ల అయితే సర్పంచ్ పదవికి పోటీ చేయాలి అంటే వార్డు సభ్యులను గెలిపించుకునే బాధ్యత తీసుకోవాలని, ఎంత ఖర్చైనా పెట్టుకుని వారిని గెలిపించి మెజారిటీ సంపాదిస్తే పదవి దక్కుతుందని కండిషన్ పెట్టారట. ఎన్నిక ఏదైనా ధన ప్రవాహం అనివార్యం. కాబట్టి ఈ ఖర్చును ఔత్సాహికుల నెత్తి మీదే వేసి వార్డు మెంబర్లను గెలిపించుకోండి, పదవి దక్కించుకొంది అంటున్నారట. ఈ తరహా ప్రక్రియలో కూడ అర కోటి వరకు ఖర్చు పెట్టక తప్పదు. ఈ వేలం పాటల పర్వం కొత్తదేమీ కాదు. ఎప్పటి నుండో నడుస్తున్నదే. డబ్బు ఇచ్చేవారు పార్టీ ఫండ్ అంటూనే, నియోజకవర్గం అభివృద్ధి కోసమనో చెప్పి చెల్లిస్తుంటారు. అయితే ఈసారి రేటు కొంచెం ఎక్కువగా ఉంది అంతే.