ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు ఎలా శతృవవుతారు.?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తప్పులో కాలేశారు. గతంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌ని చప్రాసీతో పోల్చారు కేసీయార్. ఇప్పుడూ ప్రధాని నరేంద్ర మోడీ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే వున్నారు. ఆయన నైజమే అంత.

కొన్నాళ్ళ క్రితం వరకు బీజేపీ – టీఆర్ఎస్ మధ్య తెరవెనుకాల ‘స్నేహం’ మంచిగానే వుంది. కానీ, ఎక్కడో వ్యవహారం తేడా కొట్టింది. అప్పటినుంచీ, బీజేపీ మీద కేసీయార్ తీవ్రాతి తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. కేంద్రాన్ని, అందునా ప్రధాని నరేంద్ర మోడీని తెలంగాణ సమాజానికి బూచిగా చూపేందుకు కేసీయార్ పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు.

రాజకీయాల్లో విమర్శలు సహజాతి సహజం. కానీ, ‘తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోడీ శతృవుగా మారారు’ అనే విమర్శలు చేయడం ఎంతవరకు సబబన్నది కేసీయార్ తనను తాను ప్రశ్నించుకోవాల్సి వుంటుంది. నరేంద్ర మోడీ దేశానికే ప్రధాని. అంటే, దేశంలో ప్రతి వ్యక్తికీ ఆయనే ప్రధాన మంత్రి.

దేశంలో ప్రతి ప్రాంతానికీ ఆయనే ప్రధాన మంత్రి. అంతే తప్ప, దేశంలో ఎవరికీ ఆయన శతృవు అయ్యే అవకాశం లేదు.
ప్రధాని నరేంద్ర మోడీని తెలంగాణకు శతృవుగా అభివర్ణించడం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ చేసిన తీవ్ర తప్పిదమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

‘విమర్శించడానికి కేసీయార్‌కి ఇంకేమీ మాటలు దొరకలేదా..’ అన్నది చాలామంది రాజకీయ పరిశీలకుల ప్రశ్న.
ఇదే ప్రధాని నరేంద్ర మోడీని గతంలో కేసీయార్ పొగిడారు. పెద్ద నోట్ల రద్దు వంటి విషయాల్లో తొలుత ప్రధానిని అభినందించి, ఆ తర్వాత ‘తూచ్..’ అంటూ మాట సవరించుకున్నారు కేసీయార్.

ఏ రాజకీయ ఉద్దేశ్యాలతో అయినా, ‘ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణకు శతృవు’ అనడం అస్సలేమాత్రం సమర్థనీయం కాదు. ఒకప్పటి తెలంగాణ ఉద్యమ కాలం వేరు. ఇప్పటి పరిస్థితులు వేరు. కేసీయార్ చేసే ప్రతి వ్యాఖ్య కూడా ఇప్పుడు విశ్లేషించబడుతోంది. ఆక్షేపణీయమవుతోంది కూడా.