తెలంగాణలోనూ పేదలకు పక్కా ఇళ్ళ నిర్మాణం జరుగుతోంది. ఆంధ్రపదేశ్ రాష్ట్రంలోనూ వైఎస్ జగన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. కేంద్రం కూడా రాష్ట్రాలకు ఈ విషయంలో సహాయ సహకారాలు అందిస్తోంది. అటు కేంద్రం ఖర్చు చేసినా, ఇటు రాష్ట్రం ఖర్చు చేసినా.. అదంతా ప్రజా ధనమే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.
ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం, పెద్ద మొత్తంలో భూమిని సమీకరించి, పేదలకు సొంత ఇళ్ళను నిర్మిస్తోన్న విషయం విదితమే. జగనన్న కాలనీలు, జగనన్న ఊళ్ళు.. అంటూ వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం కూడా ఎన్టీయార్ పేరుతో ఇలా ఇళ్ళ నిర్మాణాన్ని చేపట్టింది.
ఆ అపార్టుమెంట్లలో చాలావరకు ఇప్పటికీ ఖాళీగానే వున్నాయి. అవెందుకు, లబ్దిదారులకు ఇంకా అందడంలేదు.? అన్నది మళ్ళీ వేరే చర్చ. అటు కేంద్రమైనా, ఇటు రాష్ట్రమైనా సంక్షేమ పథకాల కోసం కావొచ్చు, అభివృద్ధి కార్యక్రమాల కోసం కావొచ్చు.. ఖర్చు చేసే ప్రతి రూపాయీ ప్రజలకు చెందినదే. ప్రభుత్వాలు అప్పులు చేస్తాయ్.. వాటిని తీర్చాల్సింది ప్రజలే.
ఏ రాజకీయ పార్టీ, ఏ రాజకీయ నాయుకుడూ, ఏ ముఖ్యమంత్రీ, ఏ మంత్రీ, ఏ ప్రధాన మంత్రీ వ్యక్తిగతంగా ఆ అప్పుల్ని తీర్చే పరిస్థితి వుండదు. కానీ, ఆయా నాయకుల పేర్లతో పబ్లిసిటీ స్టంట్లు నడుస్తూనే వుంటాయి. అటు కేంద్ర ప్రభుత్వం, వ్యాక్సిన్ల సర్టిఫికెట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫొటోలు వేసినా, ఇటు రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలకు ముఖ్యమంత్రుల ఫొటోలు వాడినా.. ఇవన్నీ జస్ట్ పబ్లిసిటీ స్టంట్లు మాత్రమే.
‘పేదలకు ఇళ్ళ విషయమై కేంద్రమే పూర్తి సాయం అందిస్తోంది.. వాటిని రాష్ట్ర ప్రభుత్వం తన పబ్లిసిటీ కోసం వాడుకుంటోంది..’ అంటూ బీజేపీ ఆరోపించడంతో, కేంద్రం సాయం కొంతేననీ.. రాష్ట్ర ప్రభుత్వమే కష్టపడుతోందనీ వైసీపీ ఎదురుదాడికి దిగిన దరిమిలా.. ఈ రచ్చ సామాన్యుడి మెదళ్ళలో అనేక ప్రశ్నలకు కారణమవుతోంది.