తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ధరణి పోర్టల్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. సాధారణంగా ధరణి పోర్టల్ లో వ్యవసాయానికి సంబంధించిన భూముల వివరాలు మాత్రమే ఇప్పటి వరకు ఉండేవి. కానీ.. తాజాగా ధరణి పోర్టల్ లో అన్ని రకాల భూములకు సంబంధించిన వివరాలను నమోదు చేసి.. తెలంగాణలోని ప్రతి ఇంచు భూమికి సంబంధించిన వివరాలను అత్యంత పారదర్శకంగా ఉంచబోతున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
దాని కోసం.. వ్యవసాయేతర భూములు కలిగిన యజమానుల వ్యక్తిగత వివరాలను కూడా అధికారులు ధరణి పోర్టల్ లో నమోదు చేస్తున్నారు. దీనిపై హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. దానిపై విచారణ చేపట్టిన కోర్టు.. పోర్టల్ లో నమోదయ్యే వ్యక్తిగత వివరాలకు ఎటువంటి భద్రత కల్పిస్తున్నారంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.
కొత్త రెవెన్యూ చట్టం అనేది వ్యవసాయ భూములకు సంబంధించినదని… కొత్త రెవెన్యూ చట్టంలో ప్రజల వ్యక్తిగత వివరాల భద్రతకు సంబంధించి ఎటువంటి నియమాలు లేవని.. కోర్టు స్పష్టం చేసింది.
వ్యవసాయేతర ఆస్తుల వివరాలను సేకరించడం.. దాని కోసం ఆధార్ వివరాలను అడగడం.. అనేది ప్రజలపై ఒత్తిడి తేవడమే.. అటువంటి పనిచేయొద్దు. ఇప్పటి వరకు సేకరించిన వివరాలను కూడా వేరే కంపెనీకి అప్పగించవద్దు.. అంటూ ధరణి పోర్టల్ లో నమోదు చేసే వ్యవసాయేతర ఆస్తుల వివరాలపై హైకోర్టు స్టే విధించింది.
దీనిపై లోతుగా పరిశీలన చేసిన కోర్టు.. ధరణి పోర్టల్ లో ప్రజల వ్యక్తిగత వివరాల భద్రతపై తెలంగాణ ప్రభుత్వం రెండు వారాల్లో కౌంటర్ ద్వారా పూర్తి నివేదికను సమర్పించాలని ఆదేశించింది. అప్పటి వరకు ధరణి పోర్టల్ లో ఎటువంటి వివరాలు నమోదు చేయొద్దని స్టే విధించింది. తదుపరి విచారణకు హైకోర్టు ఈనెల 20కి వాయిదా వేసింది.