ప్రస్తుతం కరోనాకాలంలో ఉన్నాం మనం. కరోనా వల్ల ప్రపంచమంతా అతలాకుతలం అయింది. ఉద్యోగాలు లేవు.. చేతుల్లో చిల్లి గవ్వ లేదు. చేద్దామంటే పనులు లేవు. కరోనా వల్ల అన్నీ తలకిందులు అయ్యాయి. ఇప్పుడిప్పుడే అన్నీ సర్దుకుంటున్నాయని అనుకుంటుండగానే.. కరోనా తన విశ్వరూపాన్ని మరోసారి చూపించబోతోంది. మళ్లీ కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం అయింది. దీంతో దేశం మరోసారి అప్రమత్తమయింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో దీపావళి సందర్భంగా బాణసంచా ను నిషేధించారు. టపాసులు పేల్చకూడదంటూ కొన్ని రాష్ట్రాలు ముందే ఆదేశాలు జారీ చేశాయి.
టపాసుల నుంచి వచ్చే పొగ గాలిలో కలవడం వల్ల కరోనా సోకిన వాళ్లకు ఇంకా సమస్యలు పెరిగే అవకాశం ఉందని.. కరోనా వ్యాప్తి కూడా పెరిగే అవకాశం ఉందని ముందు జాగ్రత్త చర్యగా టపాసులు పేల్చకూడదంటూ నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణలోనూ టపాసుల అమ్మకాలు, కాల్చడాన్ని బ్యాన్ చేయాలంటూ తెలంగాణ హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడా టపాసులను అమ్మడం లేదు, కాల్చడం లేదు.
అయితే.. దీని వల్ల టపాసుల దుకాణదారులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతోందని… తెలంగాణ ఫైర్ వర్క్స్ అసోషియేషన్.. సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ను కొట్టేయాలంటూ అసోషియన్ సుప్రీం తలుపు తట్టింది. దానిపై సుప్రీంలో విచారణ జరగాల్సి ఉంది. చూద్దాం.. సుప్రీం ఎటువంటి ఉత్తర్వులు ఇస్తుందో?